చంద్రబాబు సభలకు ఇక అనుమతి ఇవ్వరా?

Update: 2023-01-02 04:58 GMT
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో ఆయన రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఆయన సభలకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఆయన ఇరుకు సందుల్లో సభలు పెడుతున్నారని.. దీంతో వందల్లో మాత్రమే జనాలు వచ్చినా భారీగా వచ్చినట్టు కనిపిస్తోందని మండిపడుతున్నారు.

షూటింగు పిచ్చితో, డ్రోన్‌ షాట్ల కోసం ఇరుకు సందుల్లో సభలు నిర్వహించి ప్రజలు ప్రాణాలు తీస్తున్నారని మండిపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం కందుకూరులో టీడీపీ నిర్వహించిన ఇదేం ఖర్మ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. అలాగే కొత్త సంవత్సరం రోజును గుంటూరులో చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమంలోనూ తొక్కిసలాట మరో ముగ్గురు మరణించారు.

ఈ ఘటనపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిన్న కందుకూరులో 8 మంది మరణించారు.. నేడు గుంటూరులో ముగ్గురు మరణించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

ఇక గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అయితే చంద్రబాబు సభలకు డీజీపీ అనుమతులు ఇవ్వవద్దని డిమాండ్‌ చేశారు. అమాయక ప్రజలను తొక్కిసలాటకు గురిచేసి చంపుతున్న చంద్రబాబును రాష్ట్రంలో తిరగనివ్వవద్దని జోగి రమేష్‌ కోరారు. చంద్రన్న కానుకల పేరుతో 3 వేల మందికి టోకెన్లు ఇచ్చి 30 వేల మందిని రప్పించారని.. దీంతో తొక్కిసలాట జరిగి కొత్త సంవత్సరం వేళ ముగ్గురు అమాయకులు మరణించారని జోగి మండిపడ్డారు. ఇవన్నీ చంద్రబాబు చేసిన హత్యలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పేద ప్రజల ఉసురు తీస్తున్నారని దుయ్యబట్టారు. తన కోసం భారీ ఎత్తను జనం వస్తున్నారని చెబుతూ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబును రాష్ట్రంలో తిరిగనిస్తే మరింతమంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటాడన్నారు. చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని జోగి రమేష్‌ డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు ప్రచార పిచ్చి కారణంగానే గుంటూరు ఘటన జరిగిందని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు ఎక్కడ కాలుపెడితే అక్కడ విధ్వంసమేనన్నారు. సభల కోసం జనాన్ని తరలించి చంద్రబాబు పిచ్చి పబ్లిసిటీ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు ఘటనకు చంద్రబాబు, లోకేష్, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడులను అరెస్టు చేయాలన్నారు. మహిళలకు కానుకలు, చీరలు ఇస్తామని మాయమాటలు చెప్పడంతో భారీ ఎత్తున మహిళలు తరలివచ్చారని చెప్పారు. 3 వేల మందికి టోకెన్లు ఇచ్చి 30 వేల మందిని తరలించారని ఆరోపించారు. వీళ్ల ఉసురు చంద్రబాబుకు ఖాయంగా తగులుతుందని చెప్పారు. అధికారంలోకి రావడానికి ఎవరెలా చచ్చినా చంద్రబాబుకి ఫరవాలేదని కొడాలి నాని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని కోరారు.

కందుకూరు, గుంటూరు ఘటనలను చూపి చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వవద్దనేది టీడీపీ నేతల డిమాండ్‌ గా కనిపిస్తోంది. చంద్రబాబును రాష్ట్రంలో ఎక్కడా తిరగనివ్వవద్దని కోరుతున్నారంటే ఆయనను చూసి వైసీపీ భయపడుతున్నట్టేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఇరుకు సందుల్లో సభలు నిర్వహిస్తున్నది నిజమే అనుకున్నా ఆయన సభలకు ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారన్నది అంతే నిజమని చెబుతున్నారు.

ఓవైపు లోకేష్‌ పాదయాత్రను అడ్డుకుంటామని ఇప్పటికే వైసీపీ నేతలు ప్రకటించారు. మరోవైపు చంద్రబాబును సైతం రాష్ట్రంలో తిరగనీయకుండా చేయాలని డీజీపీని కోరుతుండటం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News