ధర్మాన లాజిక్ బాగానే ఉంది ..

Update: 2016-06-14 09:30 GMT
ఏపీలో రెండంకెల వృద్ధి.. జీడీపీ పెరుగుదల అంటూ ప్రభుత్వం చెబుతుండడంపై విపక్ష వైసీపీ నేత - మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విరుచుకుపడ్డారు. లాజిక్కులతో ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీడీపీ పెరిగిందని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారని..  అయితే, ఆధాయం పెరిగిందని మాత్రం చెప్పడం లేదని.. బీద అరుపులు అరుస్తున్నారని అన్నారు. ఆదాయం పెరిగితేనే జీడీపీ పెరుగుతుంది కాబట్టి... రాష్ట్ర ఆదాయం మెరుగుపడినట్లు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. జీడీపీ పెరగడం అవాస్తవమా? లేదంటే ఆదాయం పెరిగిన సంగతి దాచిపెడుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు.   ఆదాయం పెరిగితేనే జీడీపీ పెరుగుతుందన్న విషయం తెలియని ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తుండటం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు.

ఈ రోజు జరిగిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ధర్మాన... ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు కురిపించారు.  చంద్రబాబు పాలనను తప్పుబట్టారు. పట్టిసీమ ప్రాజెక్టును కమీషన్ల కోసమే చేపట్టారని విమర్శించారు. ప్రతి పనిలో తెలుగుదేశం నేతలకు ముడుపులు అందుతున్నాయని, ఆఖరికి వృద్ధులకు ఇస్తున్న రూ. 1000 పింఛనులో - గ్రామ కమిటీలు రూ. 100 నొక్కేస్తున్నారంటూ తీవ్ర ఆరోపనలు చేశారు. అడుగడుగునా అవినీతి రాజ్యమేలుతోందని ఆయన మండిపడ్డారు.

మరోవైపు వైసీపీ సమావేశంలో పార్టీ అధినేత జగన్ కూడా మాట్లాడారు. శ్రేణుల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. చంద్రబాబు కుయుక్తులను ఏవిధంగా అడ్డుకోవాలో చర్చించాలన్నారు.   వైసీపీలో ఐదేళ్ల క్రితం విజ‌య‌మ్మ‌ - తాను మాత్ర‌మే ఉన్నట్లు ఆ త‌రువాత పార్టీ అంచెలంచెలుగా ఎదిగింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. పార్టీ పెట్టిన‌ప్ప‌టినుంచి ప్ర‌జ‌ల త‌ర‌ఫున తాము నిరంతరం ఉద్య‌మిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పొకాచ్చారు.
Tags:    

Similar News