ఆ కీల‌క నిర్ణ‌యం నుంచి జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గిన‌ట్టేనా?

Update: 2022-10-15 10:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోమారు విజ‌య ఢంకా మోగించాల‌ని వైఎస్సార్సీపీ ఉవ్విళ్లూరుతోంది. లెక్క‌కు మిక్కిలిగా అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలే త‌మ‌ను విజ‌య తీరాల‌కు చేరుస్తాయ‌ని ముఖ్య‌మంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నుంచి చోటా నేత‌ల వ‌ర‌కు గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. 175కి 175 అసెంబ్లీ సీట్లు సాధించాల‌ని వైఎస్ జ‌గ‌న్.. త‌న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు ఉద్భోదిస్తున్నారు. ఇప్ప‌టికే గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం పేరుతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జులు ఇంటి ఇంటికీ తిరుగుతున్నారు.

ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఈ మూడేళ్ల‌లో ప్ర‌భుత్వం చేసిన మేలును ఎమ్మెల్యేలు వివ‌రిస్తున్నారు. ప‌నిలో ప‌నిగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రాసిన లేఖ‌ను కూడా ప్ర‌జ‌ల చేతుల్లో పెడుతున్నారు. అయితే ఇంత చేస్తున్నా ప్ర‌జ‌ల నుంచి కొంత‌మందికి నిర‌స‌న‌లు త‌ప్ప‌డం లేదు. అభివృద్ధి లేద‌ని, త‌మ‌కు ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని ప్ర‌జలు ప‌లుచోట్ల ఎమ్మెల్యేల‌ను నిల‌దీస్తున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే మీడియాలో ప‌లు క‌థ‌నాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుత‌మున్న వైసీపీ ఎమ్మెల్యేల్లో దాదాపు 70 మందిపైన ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి ఉంద‌ని వివిధ స‌ర్వే సంస్థ‌లు జ‌గ‌న్‌కు నివేదిక ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. వీటిలో జ‌గ‌న్ సొంతంగా చేయించుకుంటున్న ప్ర‌శాంత్ కిశోర్ ఐ ప్యాక్ కూడా ఉందంటున్నారు. ఈ నేప‌థ్యంలో వీరికి బ‌దులుగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త అభ్య‌ర్థుల‌ను దింప‌క‌పోతే పార్టీకి తీవ్ర న‌ష్టం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించిన‌ట్టు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అద‌న‌పు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లను నియ‌మించాల‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్ నిర్ణ‌యించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే గుంటూరు జిల్లాలో రాజ‌ధాని ప‌రిధిలో వైసీపీ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న తాడికొండ నియోజ‌క‌వ‌ర్గంలో డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌ను నియోజ‌క‌వ‌ర్గ‌ అద‌న‌పు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించారు. ఈ నిర్ణ‌యంతో శ్రీదేవి అగ్గిమీద గుగ్గిల‌మ‌య్యారు. త‌న నిర‌స‌న‌ను తీవ్ర స్థాయిలో తెలియ‌జేశారు. ఏకంగా గుంటూరు జిల్లా వైసీపీ అధ్య‌క్షురాలు మేక‌తోటి సుచ‌రిత ఇంటి ముందు అర్ధ‌రాత్రి పూట ధ‌ర్నా చేసి క‌ల‌క‌లం రేపారు.

దీంతో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అద‌న‌పు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను నియ‌మించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని, అభ్య‌ర్థుల‌ను కూడా సిద్ధం చేసుకున్న సీఎం జ‌గ‌న్ డైల‌మాలో ప‌డ్డార‌ని టాక్‌. వాస్త‌వానికి ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుత‌మున్న ఎమ్మెల్యే లేదా నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌తోపాటు అద‌నంగా ఇంకో అభ్య‌ర్థిని అద‌న‌పు స‌మ‌న్వ‌య‌క‌ర్త రూపంలో నియ‌మిస్తే పోటాపోటీగా నేత‌లు ప‌నిచేస్తార‌ని, ప్ర‌జ‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉంటార‌ని, త‌మ‌కే టికెట్టు రావాల‌నే కోణంలో క‌ష్టించి ప‌నిచేస్తార‌ని జ‌గ‌న్ భావించారు.

అయితే ఇప్పటికే ఎమ్మెల్యేలు గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ద్వారా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని అంటున్నారు. ప్ర‌జ‌లు ఎక్క‌డిక‌క్క‌డ వీరిని నిల‌దీస్తుండ‌టం, అభివృద్ధి లేక‌పోవ‌డంతో స‌మాధానం చెప్పుకోలేక‌పోతున్నార‌ని సమాచారం. మ‌రోవైపు సొంత పార్టీ నేత‌ల నుంచి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో తాము చేసిన బిల్లుల‌కు డ‌బ్బులు రాలేద‌ని గ్రామ‌స్థాయి నేత‌లు నిల‌దీస్తున్నారు.  

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికే ఉన్న ఎమ్మెల్యేలు లేదా నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జుల‌కు తోడు అద‌న‌పు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జును నియ‌మిస్తే గంద‌ర‌గోళం త‌ప్ప‌ద‌ని.. నేత‌ల మ‌ధ్య పోటీ ఏమో కానీ.. ఒక‌రిని దెబ్బ తీసుకోవ‌డానికి ఒక‌రు ప్ర‌య‌త్నిస్తార‌ని.. త‌ద్వారా అంతిమంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక‌రిని ఒక‌రు ఓడించుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తే పార్టీ న‌ష్ట‌పోతుంద‌ని వైసీపీ ముఖ్య నేత‌లు జ‌గ‌న్‌కు చెప్పిన‌ట్టు ప్ర‌చారం న‌డుస్తోంది.

అందులోనూ కొత్త‌గా అద‌న‌పు నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జుల‌ను నియ‌మిస్తే తామే అస‌లు సిస‌లైన అభ్య‌ర్థుల‌మని వాళ్లు భావించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అలాంటి భావ‌న ఇంకా అద‌న‌పు స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతుంద‌ని వైసీపీ ముఖ్య నేత‌లు జ‌గ‌న్‌కు చెప్పిన‌ట్టు టాక్‌.

ఇలాంటి భ‌యాల‌తోనే జ‌గ‌న్ నియోజ‌క‌వ‌ర్గాల్లో అద‌న‌పు ఇన్‌చార్జుల నియామ‌కాల నిర్ణ‌యాన్ని ఉపసంహ‌రించుకున్నార‌ని టాక్ న‌డుస్తోంది. ప్ర‌శాంత్ కిషోర్ ఐ ప్యాక్‌తోపాటు జ‌గ‌న్ చేయిస్తున్న మ‌రో రెండు స‌ర్వే సంస్థ‌లు, వైసీపీ నేత‌లు త‌మ స్థాయిల్లో తాము చేయిస్తున్న స‌ర్వేల్లో సైతం దాదాపు 70కి పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌కు మార్చ‌క త‌ప్ప‌ద‌ని తేల్చిన‌ట్టు స‌మాచారం. అటు ఇటుగా ఈ సంఖ్య వంద మందికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వీరి స్థానాల్లో అయితే కొత్త‌వారు రావాల్సిందేన‌ని అంటున్నారు.

చివరికి ఈ నియామకాల విషయంలో వెనుకడుగు వేసినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ బలహీనంగా ఉందని.. ఐ ప్యాక్‌తో పాటు మరో రెండు స్వతంత్ర సర్వే సంస్థల నివేదికలను పరిశీలించి కనీసం 70 నుంచి 100 నియోజకవర్గాల్లో అయినా కొత్త వారిని ప్రోత్సహించాలనే ఆలోచన చేస్తున్నారు. అయితే ఇప్పుడేవారి మధ్యచిచ్చు పెట్టడం ఎందుకని.. తాడికొండలో పరిస్థితి చూస్తే అర్థమైపోతుందని వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కున్నాయి. శ్రీదేవి ఎమ్మెల్యేగా ఓ వర్గాన్ని రెడీ చేసుకున్నారు. వారంతా డొక్కాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇతర నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అందుకే వీలైనంత వరకూ ఈ అదనపు సమన్వయకర్తల విషయంలో వెనక్కితగ్గడమే మంచిదని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News