మనీశ్ సిసోడియా 14 ఫోన్లు మార్చారా? కోర్టులో బయటకొచ్చిన కొత్త విషయం

Update: 2023-03-11 11:04 GMT
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి తాజాగా చోటు చేసుకున్న పరిణామాల కారణంగా కొత్త అంశాలు వెలుగు చూశాయి. ఈ కుంభకోణంపై మరింత అవగాహన కలిగేలా కోర్టులో వాదనలు చోటు చేసుకున్నాయి.

ఇప్పటికే ఈ ఉదంతంలో అరెస్టు అయిన మాజీ ఢిల్లీ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఎంత ముదురు కేసన్న అంశంపై ఈడీ తరఫు లాయర్ పలు అంశాల్ని ప్రస్తావించారు.

లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన సిసోడియాను రౌజ్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయన్ను పది రోజులు కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టును కోరారు. ఈ అంశంపై విచారణ సాగింది.

విచారణలో భాగంగా ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హోస్సేన్ తన వాదనలు వినిపించారు. ఆయన వాదనల్లోని కీలక అంశాల్ని చూస్తే..

-  సౌత్‌ గ్రూపునకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు జరిగాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు భారీ లబ్ధి చేకూర్చారు. ఇందులో భాగంగా మద్యం విధానంలో మార్పులు చేశారు. కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.
-  కొత్త విధానంలో ప్రజలు.. భాగస్వాముల నుంచి తీసుకున్న సలహాలు.. సూచనలు అన్నీ కూడా కంటితుడుపు చర్యలుగానే స్వీకరించారు.
- కార్టలైజేషన్ కు అనుకూలంగా ఉండేలా మంత్రుల టీం నివేదికలో సంస్థల నిర్వచనాన్ని నీరు కార్చింది. ఈ అంశంపై తాను సూచనలు చేశానని.. కానీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్టించుకోలేదని.. అప్పట్లో ఆయనకు కార్యదర్శిగా వ్యవహరించిన ఉద్యోగి చెప్పారు.
-  ఇండో స్పిరిట్స్ కంపెనీకి ఎల్ 1 లైసెన్సు లభించటంలో మనీశ్ సిసోడియా కీలకంగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన అప్లికేషన్ జెట్ స్పీడ్ లో వచ్చాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే వాటిని ఆమోదించి లైసెన్సులు కేటాయించారు.
-  దీనికి సంబంధించిన ఆధారాల్ని సిసోడియా ధ్వంసం చేశారు. ఇతరుల పేరు మీద ప్లిక్ కార్ట్ లో ఫోన్లు కొనుగోలు చేశారు. సిమ్ కార్డులు కూడా ఇతరుల పేర్ల మీదనే పొందారు. ఏడాది వ్యవధిలో ఆయన 14 ఫోన్లు ధ్వంసం చేయటం కానీ మార్చటం కానీ జరిగింది.
-  కొత్త మద్యం పాలసీకి సంబంధించిన నివేదికను కేబినెట్ లో ప్రవేశ పెట్టానికి రెండు రోజుల ముందు ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు దీన్ని పంపారు. దీనికి సంబంధించిన కోఆర్డినేషన్ విజయ్ నాయర్ చేశారు.  
-  ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు సౌత్ గ్రూపు ద్వారా దాదాపు రూ.100 కోట్ల మేర ముడుపులు అందాయి. ఆ నగదును హైదరాబాద్ నుంచే ఢిల్లీకి తరలించారు. ఈ ప్రకారంగా ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో 30 శాతం వాటాను ఒక పెద్ద కార్టెల్ సొంతం చేసుకుంది. లాభంలో 12 శాతాన్ని ఏకపక్షంగా చేర్చారు.
-  సిసోడియా తరఫున విజయ్ నాయర్ ప్రతినిధిగా వ్యవహరించారు. ఎమ్మెల్సీ కవిత ఆయన్ను కలిసినట్లుగా వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీకి అవసరమైన నిధుల గురించి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. ఈ కేసులో అరెస్టు అయిన అమిత్ అరోరా ఫోన్ లో మాట్లాడారు.
-  ఈ స్కాంలో దాదాపు రూ.292 కోట్ల మేర అక్రమార్జన చోటు చేసుకుంది. మనీశ్ సిసోడియాతో పాటు.. మరికొందరిని ముఖాముఖిని కూర్చోబెట్టి ప్రశ్నలు వేయాల్సి ఉందని.. అందుకు మేం ఏడుగురికి నోటీసులు అందజేశాం. పది రోజులు ఆయన్ను కస్టడీకి ఇవ్వాలి.

అయితే.. ఈ వాదనల్ని సిసోడియా తరఫు న్యాయవాది దయన్ క్రిష్ణన్ తప్పు పట్టారు. లిక్కర్ పాలసీలో లోపాలు ఉన్నట్లుగా ఈడీ వాదిస్లోందని.. అసలు ఈడీకి ఆ పరిధి లేదన్నారు. రాజ్యాంగ స్వరూపం ప్రకారం అదంతా కార్యనిర్వాహక వ్యవస్థకు సంబంధించిన అంశమని.. ప్రజల కోసం విధానాలను రూపొందించటం అధికార విధిగా స్పష్టం చేశారు. మద్యం విధానంలో 12 శాతం మార్జిన్ ను పెంచటంపై లెఫ్టెనెంట్ గవర్నర్ అభ్యంతరం చెప్పలేదన్న విషయాన్ని ప్రస్తావించారు.

మనీలాండరింగ్ కు సంబంధించిన ఒక్క రూపాయి సిసోడియా వద్ద లభించలేదని.. ఆయన తరఫున విజయ్ నాయర్ ప్రతినిధిగా వ్యవహరించినట్లుగా చెప్పటం కామెడీగా ఉందన్నారు. ఈ కేసులో సిసోడియాకు ఈడీ ముందు ఎప్పుడూ నోటీసులు జారీ చేయలేదన్న ఆయన.. సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ విచారణకు వస్తున్న ఒక రోజు ముందు అరెస్టు చేసిన విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోవాలన్నారు. సిసోడియా తరఫున వాదనలు వినిపించిన మరో న్యాయవాది సైతం.. ఈ కేసులో కస్టడీకి కోరే అధికారం ఈడీకి లేదన్నారు.

సిసోడియా తరఫున వాదనలు వినిపించిన మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్.. ఈ తరహాలో ఫలానా రాజకీయ నేత డబ్బులు తీసుకున్నారని ఆరోపించి జైలుకు పంపంటం సులువుగా అభివర్ణించారు. మొత్తంగా ఈడీ కోర్టులో సిసోడియా తరఫు వాదించిన న్యాయవాదుల వాదనను.. ఈడీ తరఫున వాదనలు విన్న న్యాయమూర్తి మాజీ డిప్యూటీ సీఎంను ఏడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక.. సీబీఐ కేసులో మనీశ్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 21కు వాయిదా వేస్తూ కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News