లాక్ డౌన్ వేళ వలసజీవులు అంతమంది చనిపోయారా?

Update: 2020-09-23 07:15 GMT
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విభజన వేళ దేశ సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఘటన ఇప్పటికి మర్చిపోలేం. పొట్ట చేతపట్టుకొని దేశానికి వచ్చేసినోళ్లు ఒకవైపు.. మత ఘర్షణల నేపథ్యంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తమకు సేఫ్ గా ఉండే ప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోయిన వారెందరో. ఈ సందర్భంగా ఆస్తుల్ని వదిలేసిన వారు భారీగానే ఉంటారు. ఇలాంటి సీన్ గుర్తుకు తెచ్చేలా చేసింది కరోనా. అనూహ్యంగా మోడీ సర్కారు ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో వలసజీవులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు.

చేసేందుకు పని లేక.. ఖాళీగా ఉండలేక.. సరైన తిండి లేక వారు పడిన పాట్లు అన్నిఇన్ని కావు. దీంతో.. ఎవరికివారుగా తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు కాలిబాట పట్టారు. అధికారులు.. పోలీసులు అడ్డుకున్నా వినకుండా ప్రాణాలు పోయిన ఫర్లేదు.. తమ ఊళ్లకు తాము వెళ్లిపోతామంటూ లక్షలాదిగా రోడ్ల బాట పట్టారు. స్వతంత్ర భారతంలో అత్యంత విషాద ఘటనగా దీన్ని అభివర్ణిస్తున్నారు పలువురు. ఈ ఎపిసోడ్ లో మోడీ సర్కారు దారుణ వైఫల్యం చెందినట్లుగా పలువురు విమర్శిస్తారు.

ఇదిలా ఉండగా.. అసలు సొంతూళ్ల బాట పట్టినోళ్లు ఎంతమంది? వందలాది కిలోమీటర్లు కాలి నడకన నడిచే క్రమంలో మరణించిన వారు ఎంతమంది ఉన్నారు? ఇతర సమస్యలు ఏమిటి? లాంటి అంశాలకు సంబంధించిన గణాంకాలు ప్రభుత్వం వద్ద లేవని చెప్పటంతో ఈ వ్యవహారం మరింత వివాదంగా మారింది. అంత విషాదకర అంశానికి సంబంధించిన రికార్డులు ఏమీ లేకపోవటం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్ర సర్కారు లాక్ డౌన్ వేళ ప్రయాణించిన వలసజీవుల లెక్కల్ని బయటపెట్టింది. రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ సహాయమంత్రి వీకే సింగ్ లోక్ సభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పని చేసే వలసజీవులు.. కార్మికులు తమ సొంతూళ్లకు చేరుకున్నట్లు చెప్పారు.

కేంద్ర కార్మిక.. ఉపాధి మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం లాక్ డౌన్ వేళ పాదచారులతో సహా వలస కార్మికులు దాదాపు 1.06 కోట్ల మంది తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. అందుబాటులో ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం 2020 మార్చి - జూన్ మధ్య కాలంలో రోడ్ల మీద జరిగిన ప్రమాదాలు 81,385 అయితే.. అందులో 29,415 మంది మరణించినట్లు వెల్లడించారు.

లాక్ డౌన్ వేళ.. రోడ్డు ప్రమాదంలో మరణించిన వలస కార్మికులకు సంబంధించిన ప్రత్యేక డేటా ఏమీ సిద్ధం చేయలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వలస కార్మికులకు ఆహారం.. నీరు.. ఆరోగ్య సదుపాయాలు.. సరైన కౌన్సిలింగ్ అందించటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల్ని కోరినట్లుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు డేటా లేదన్న కేంద్రం.. ఇప్పుడు తాత్కాలిక సమాచారం అంటూ పేర్కొన్న అంకెల్ని చూస్తే.. సొంతూళ్లకు వెళ్లేందుకు కాళ్లను నమ్ముకున్న వారిలో వేలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుకోకుండానే తుదిశ్వాస విడిచారన్న విషాదం గుండెల్ని పిండేస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News