కాంగ్రెస్ లో విజయమ్మ టెన్షన్ మొదలైందా ?

Update: 2021-09-01 06:32 GMT
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి తెలంగాణలో కలకలం రేపుతోంది. 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సతీమణి విజయమ్మ సెప్టెంబర్ 2వ తేదీన హైదరాబాద్ లో ఓ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. దీనికి ఒకపుడు వైఎస్ క్యాబినెట్ లో పనిచేసిన మంత్రులు, సన్నిహితులు, మద్దతుదారులను సదరు కార్యక్రమానికి ఆహ్వానించారు. నిజానికి విజయమ్మ ఏ ఉద్దేశ్యంతో అందరినీ ఆహ్వానించారో అర్థం కాక చాలామంది జుట్టు పీక్కుంటున్నారు.

సరే ఆమె వ్యూహం ఏదైనా కాంగ్రెస్ మాత్రం ఘాటుగానే విరుచుకుపడుతోంది. కాంగ్రెస్ ఎంఎల్ఏ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విజయమ్మ కొత్త నాటకానికి తెరలేపుతున్నట్లు మండిపడ్డారు. వైఎస్సార్ తో అనుబంధం వేరు ఇప్పుడు రాజకీయాలు వేరన్నారు. వైఎస్ షర్మిల తెలంగాణా కోడలే అనుకున్నా విజయమ్మ ఏమవుతుందంటు నిలదీశారు. ఏపీలో కొడుకు జగన్మోహన్ రెడ్డిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి, బీజేపీతో దోస్తానా చేస్తున్నట్లు మండిపోయారు.

జగన్ను సీఎం కుర్చీలో విజయమ్మ కూర్చోబెట్టడం ఏమిటో ? బీజేపీతో దోస్తానా చేయడం ఏమిటో జగ్గారెడ్డికే తెలియాలి. షర్మిలతో కలిసి విజయమ్మ తెలంగాణాలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని జగ్గారెడ్డి రెచ్చిపోయారు. అయితే తెలంగాణలో తల్లీ, కూతుర్లు ఎందుకు రాజకీయాలు చేయకూడదో మాత్రం జగ్గారెడ్డి చెప్పలేకపోయారు. తెలంగాణాలో ఏపీ వాళ్ళు రాజకీయాలు చేయకూడదని ఎక్కడుందో జగ్గారెడ్డి సమాధానం చెప్పలేదు.

ఎవరు ఎక్కడ రాజకీయాలు చేయాలన్నా అందుకు ప్రజల ఆమోదం అవసరం. ప్రజల మద్దతు లేకపోతే ఎంత పెద్ద తోపునేతలు అనుకుంటున్నవారు కూడా మూలన కూర్చోవాల్సిందే. అలాగే ప్రజల మద్దతు లభిస్తే రాజకీయాలకు కొత్తవారికి కూడా అందలాలు చాలా తేలిగ్గా వచ్చేస్తాయి. ప్రజాస్వామ్యంలో ఉన్న బ్యూటీనే ఇది. రేపు షర్మిల, విజయమ్మను జనాలు ఆదరించకపోతే వాళ్ళే రాజకీయంగా కనుమరుగైపోతారు. లేదు ప్రజలు ఆదరించి తల్లీ, కూతుళ్లకు అందలాలు ఎక్కిస్తే ఈ రోజున విమర్శిస్తున్న జగ్గారెడ్డి కూడా వాళ్ళ పార్టీలో చేరుతారేమో ఎవరు చూడొచ్చారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైఎస్సార్ ఆత్మీయులతో విజయమ్మ ఇంకా సమావేశం కాకమునుపే కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలైపోయింది. బహుశా సెంటిమెంట్ పేరుతో కాంగ్రెస్ నేతలను విజయమ్మ కూతురు పెట్టిన పార్టీలోకి లాక్కునేందుకు ప్రయత్నిస్తారనే భయం మొదలైనట్లే ఉంది. లేకపోతే రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని ఒకవైపు విజయమ్మ చెబుతున్నా జగ్గారెడ్డి విమర్శలు చేయాల్సని అవసరం లేదుకదా. చూద్దాం సెప్టెంబర్ 2వ తేదీ ఏమి జరగబోతోందో.




Tags:    

Similar News