ట్రంప్ ను మించిన మోడీ చాణక్యం.!

Update: 2020-03-29 08:09 GMT
మోడీ అంటేనే మొనగాడు అని బీజేపీ వారు అంటారు. వట్టి మొండి అని ప్రతిపక్షాలు అంటుంటాయి. ఈ రెండు కలిస్తేనే లీడర్ అని రాజకీయ కోవిదులు అంటారు. నాయకుడికి మొండితనం కూడా ఉండాలి. అయితే అది వాడాల్సిన టైంలోనే వాడాలి. ఆ విధంగా చూస్తే మోడీ మొండితనం ఈ దేశానికి బాగానే పనికివస్తోందనిపిస్తోంది.

మోడీ మొండితనంలో పాకిస్థాన్ తో పోరుకు వెళ్ళారు. దాని పీచమణిచారు. కాశ్మీరు విషయంలో ఈ దేశ పాలకులు ఎవరూ వేయనన్ని అడుగులు ముందుకేశారు. డెబ్బయ్యేళ్ళ పాటు నానుతున్న 370 ఆర్టికల్ ని రద్దు చేసి పారేశారు. ఒక్క అలజడి కూడా లేకుండా చూసుకున్నారు. అదే విధంగా ఆయోధ్య రామాలయం విషయంలో కోర్టు తీర్పులకు కట్టుబడి ఉన్నారు. చివరకి అనుకూలంగా తీర్పు వచ్చింది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా రక్కసి భారత్ లో అడుగుపెట్టింది. అయితే దాని సంగతి కూడా చూసుకుందామంటూ మోడీ ఏకంగా అత్యంత సాహసవంతమైన నిర్ణయాలు వరసగా తీసుకుంటున్నారు. మొదట జనతా కర్ఫ్యూ అన్నారు. ఆ తరువాత ఏకంగా ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ అంటూ దేశం మొత్తానికి తాళం వేసేశారు. ఇది నిజంగా డేరింగ్ స్టెప్ అని చెప్పాలి. ఏ ఒక్క విపక్షం నోరు ఎత్తని విధంగా మోడీ చర్యలు ఉంటున్నాయి, ప్రజలు కూడా అనుసరిస్తున్నారు.

అంతే కాదు కరోనా కట్టడిలో ఇప్పటివరకూ మోడీ విజయమే సాధించారు. మోడీ చాలా వ్యూహాత్మకంగా మెరుపు వేగంతో తీసుకుంటున్న నిర్ణయాల వెనక 130 కోట్ల మంది జనం ఆదరణ ఉంది, నమ్మకం ఉంది. మోడీ చెబితే ఏమైనా చేస్తామంటూ ముందుకు వచ్చే యువతరం ఉంది. అందుకే మోడీ మళ్ళీ నెటిజన్లకు హీరో అయిపోయాడు.

ఇంత పెద్ద దేశాన్ని ఇన్ని రోజుల పాటు లాక్ డౌన్ కంట్రోల్లో పెట్టిన ఘనతను మోడీ సాధిస్తే అగ్ర రాజ్య అధిపతిగా చెప్పుకుంటున్న ట్రంప్ మాత్రం లాక్ డౌన్ చేయలేకపోయారు. పైగా కరోనా వైరస్ ని అక్కడ ముందు చూపుతో కంట్రోల్ చేయలేకపోయారు. దాంతోనే ఎన్నడూ లేని విధంగా అమెరికా ఇపుడు దారుణ ఫలితాలు అనుభవిస్తోంది.

అమెరికాలో ట్రంప్ కరోనా కంట్రోలింగ్ లో వెనకబడితే వైద్య సదుపాయాలు పెద్దగా లేని అతి పెద్ద జనాభా - పేదలు కలిగిన భారత్ లో మోడీ కరోనాని నియంత్రిస్తున్న తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మెచ్చుకుంది. మొత్తానికి పెద్దన్న ట్రంప్ ని మోడీ ముందుకు దాటేశారని అంటున్నారు.
   

Tags:    

Similar News