అంబానీ బ్ర‌ద‌ర్స్‌ లో ఈ వేరియేష‌న్ చూశారా?

Update: 2017-12-28 07:37 GMT
రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ పేరు వింటేనే... గ‌తంలో అయితే ద గ్రేట్ బిజినెస్ మ్యాన్‌గా పేరుగాంచిన ధీరూభాయి అంబానీ గుర్తుకు వ‌చ్చేవారు. ఇప్పుడైతే ధీరూభాయి పెద్ద కుమారుడు ముఖేశ్ అంబానీనే గుర్తుకు వ‌స్తారు. ధీరూభాయికి ముఖేశ్ తో పాటు అనిల్ అంబానీ అనే చిన్న కొడుకు ఉన్నాడ‌న్న విష‌యం తెలిసినా... ఇప్పుడు రిల‌య‌న్స్ పేరు చెబితే అస‌లు అనిల్ ప్ర‌స్తావ‌నే రావ‌ట్లేదు. అస‌లు అనిల్ అంబానీ ఇంకా బిజినెస్ చేస్తూనే ఉన్నారా? అని ఎదురు ప్రశ్నించే వారు కూడా లేక‌పోలేదు. ధీరూభాయి బ‌తికున్నంత కాలం కూగా రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ ఒక్క‌టిగానే ముందుకు సాగింది. అంబానీల‌కు చాలా వ్యాపారాలున్నా... రిల‌య‌న్స్ గొడుగు కిందే అవ‌న్నీ కొన‌సాగాయి. కొత్త‌గా పుట్టుకొచ్చే ఏ సంస్థ‌నైనా వారు రిల‌యన్స్ సబ్సిడ‌రీగానే ఏర్పాటు చేశారు త‌ప్పించి... వేరే కంపెనీగా పేర్కొన‌లేదు. అందుకేనేమో... రిల‌య‌న్స్ ఎదిగినంత త్వ‌ర‌గా ఏ కంపెనీ కూడా ఎదిగిన దాఖ‌లా లేదు.

ధీరూభాయి బ‌తికున్నంత కాలం ముఖేశ్ - అనిల్‌ లు క‌లిసే ముందుకు సాగినా.... తండ్రి మ‌ర‌ణానంత‌రం వారిద్ద‌రూ వేరు ప‌డిపోయారు. తండ్రి సంపాదించి పెట్టిన ఆస్తుల‌ను - వ్యాపారాల‌ను ఇద్ద‌రికీ స‌మానంగా పంచి ఇచ్చే బాధ్య‌త‌ను స్వీక‌రించిన ధీరూభాయి స‌తీమ‌ణి కోకిలా బెన్‌... పంపిణీలో స‌మ న్యాయం పాటించారు. ఆర్థిక రంగ నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగిన ఈ ఆస్తుల విభ‌జ‌న‌పై ముఖేశ్‌ తో పాటుగా అనిల్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. తండ్రి ప్రారంభించిన రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ పేరును కొన‌సాగించేందుకే ఇష్ట‌పడ్డ ముఖేశ్‌... త‌న బిజినెస్ మొత్తాన్ని ఇప్ప‌టికీ అదే బ్రాండ్ మీదే కొన‌సాగిస్తున్నారు. తండ్రి కంటే కూడా య‌మా స్పీడుగా వెళుతున్న ముఖేశ్.... ఇప్పుడు దాదాపుగా అన్ని రంగాల్లోనూ అడుగుపెట్టేశార‌నే చెప్పాలి. అడుగు పెట్టిన ప్ర‌తి చోటా ముఖేశ్‌ కు విజ‌య‌మే త‌ప్పించి అప‌జ‌యం అన్న మాట వినిపించ‌డం లేదు. వెర‌సి రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లాభాలు భారీగా పెర‌గ‌డ‌మే కాకుండా... ముఖేశ్‌ ను అప‌ర కుబేరుడిని చేశాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఆస్తుల విభ‌జ‌న త‌ర్వాత ముఖేశ్ ఆస్తితో స‌రిస‌మానంగా ఉన్న వ్యాపారాల‌ను చేజిక్కించుకున్న అనిల్ అంబానీ... ఆ త‌ర్వాత ఒక్కో బిజినెస్‌ ను ఒక్కో విభాగంగా విభ‌జించి ముందుకు సాగారు. ఈ త‌ర‌హా వ్యూహం ఆయ‌న‌కు తొలుత కొంత మేర అనుకూలించినా... ఇప్పుడు ఆయ‌న‌ను అధోఃపాతాళానికి దిగ‌జార్చాయి. వెర‌సి రూ.1.8 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద‌తో సోద‌రుడి నుంచి విడిపోయిన అనిల్ గ్రూప్ ఇప్పుడు కేవ‌లం రూ.50 వేల కోట్ల‌కు ప‌డిపోయింది. అంతేకాకుండా అనిల్ చేతిలోని దాదాపుగా అన్ని కంపెనీల‌పై భారీ ఎత్తున అప్పులున్నాయ‌ట‌. వీటిని తీర్చేందుకు నానా తంటాలు ప‌డుతున్న అనిల్ త్వ‌ర‌లోనే.. వ్యాపార రంగం నుంచి అదృశ్య‌మైనా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అస‌వ‌రం లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఈ అన్ని ప‌రిణామాల‌ను చాలా ఆసక్తిగా ప‌రిశీలిస్తున్న బిజినెస్ వ‌ర్గాలు... ఓ కొత్త అంశాన్ని క‌నుగొన్నాయి. అదేమిటంటే.. అన్న‌తో స‌రిస‌మానంగా ఆస్తిని పంచుకున్న అనిల్ ఆస్తి విలువ ఇప్పుడు ముఖేశ్ కు ఉన్న ఆస్తిలో ప‌ది శాతం మాత్ర‌మేన‌ట‌.
Tags:    

Similar News