సర్వీస్‌ రివాల్వర్‌ తో కాల్చుకొని డీఐజీ ఆత్మహత్య!

Update: 2023-07-07 13:27 GMT
తమిళనాడులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది! సర్వీస్‌ రివాల్వర్‌ తో కాల్చుకొని కోయంబత్తూరుకు డిప్యూటీ ఇన్‌ స్పెక్టర్ జనరల్‌ ఆఫ్‌ ఫోలీస్‌ (డీఐజీ) విజయ్‌ కుమార్‌ ప్రాణాలు విడిచారు. కోయంబత్తూరులోని డీఐజీ అధికారిక నివాసంలో ఈ సంఘటన వెలుగు చూసింది.

అవును... సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ 45 ఏళ్ల విజయ్‌ కుమార్‌ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయారు. ఈయన కోయంబత్తూరు రేస్ కోర్స్ సమీపంలో రెడ్ ఫీల్డ్స్‌ లోని క్వార్టర్స్‌ లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో డీఐజీ విజయ కుమార్ ఇంటినుంచి తుపాకీ పేలిన శబ్ధం వినిపించింది. దీంతో అలర్ట్ అయిన ఇంటి భద్రతా సిబ్బంది.. లోపలికి వెళ్లి చూసేసరికి... అప్పటికే డీఐజీ మృతిచెందినట్లు నిర్ధారించుకున్నారని తెలిసింది.

అనంతరం సీనియర్‌ అధికారులను అప్రమత్తం చేశారని తెలుస్తుంది. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పై అధికారులు... మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారని సమాచారం.

అయితే ఆయన మృతికి గల కారణలపై స్పష్టత రావాల్సి ఉంది. మరోపక్క ఆయన గతకొంతకాలంగా తీవ్ర డిప్రెషన్‌ లో ఉన్నారని.. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన కౌన్సిలింగ్‌ కూడా తీసుకుంటున్నారని చెబుతున్నారంట.

2009 ఐపీఎస్‌ బ్యాచ్‌ కు చెందిన విజయ్‌ కుమార్‌.. ఈ ఏడాది జనవరిలో కోయంబత్తూరు రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకముందు ముందు కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తిరువారూర్‌ లకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ గా (ఎస్పీ) అన్నానగర్ డిప్యూటీ కమిషనర్‌ గా పనిచేశారు.

కాగా.. తమిళనాడులో సీనియర్ అధికారి ఒకరు ఆత్మహత్యకు పాల్పడడం ఈ మధ్య సంవత్సరాలలో ఇది రెండవది. తిరుచెంగోడ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విష్ణుప్రియ 2015లో నమక్కల్ జిల్లాలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఉరి వేసుకుని మరణించింది.

అయితే డీఐజీ ఆత్మహత్యపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విటర్‌ లో స్పందించిన ఆయన... "పోలీస్‌ అధికారి విజయ్‌ కుమార్ అకాల మరణ వార్త విని దిగ్భ్రాంతి గురయ్యాను.

ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగించింది. జిల్లా ఎస్పీతోపాటు వివిధ హోదాల్లో పనిచేసిన విజయ్‌ కుమార్‌ మరణం తమిళనాడు పోలీస్‌ శాఖకు తీరని నష్టం. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు.

Similar News