సిరాకు పుట్టిస్తోన్న ‘పింక్’ నోట్

Update: 2016-11-14 06:47 GMT
ముదురు గులాబీ రంగుతో బుజ్జిబుజ్జిగా ఉండే సరికొత్త రూ.2వేల నోటును చూసినంతనే చాలామంది మురిసిపోయారు. కొత్త నోటును చేతిలోకి తీసుకునేందుకు.. దాని సొంతదారు అయ్యేందుకు తపించినోళ్లు చాలామందే ఉన్నారు. పింక్ నోటు మీద మోజుతో వచ్చిపడే కష్టాల గురించి పెద్దగా పట్టించుకోని వారు ఇప్పుడు కిందామీదా పడిపోతున్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో మార్కెట్లో చెలామణీలో ఉన్న అతి పెద్ద నోటు వంద రూపాయిలు మాత్రమే. దాని తర్వాత కొత్తగా విడుదల చేసిన రూ.2వేల నోటు.

పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకులు పని చేయటం మొదలైన నాటి నుంచి ఈ కొత్త నోటును చేజిక్కించుకోవటానికి చాలామంది ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా చేతికి వచ్చే రూ.2వేల నోటుతో ఎదురయ్యే కష్టాల గురించి వారు పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే.. బ్యాంకులు ఇచ్చే రూ.4వేల మొత్తాన్ని రెండు పెద్ద నోట్లతో సరిపుచ్చుకున్నోళ్లు చాలామందే ఉన్నారు.

కొత్త ఉత్సాహంతో రూ.2వేల నోటును సొంతం చేసుకున్నోళ్లు.. అది కాస్తా చేతికి వచ్చాక కానీ అసలు కత మొదలవుతుంది.చేతిలో ఉన్న కొత్త నోటును దర్జాగా ఎక్కడికి తీసుకెళ్లినా.. ఆసక్తిగా చూడటమే తప్పించి మార్చుకునేందుకు ఏమాత్రం ఇష్టపడని పరిస్థితి. ఎందుకంటే.. రూ.2వేల నోటుకు ఏ రూ.200.. రూ.300 బిల్లు చేసి మిగిలిన మొత్తాన్ని చిల్లర ఇవ్వాల్సి రావటంతో దుకాణదారులు పింక్ నోటును తీసుకునేందుకు ఆసక్తిని ప్రదర్శించటం లేదు. ఇలా ఒకరుకాదు.. ఇద్దరు కాదు.. దాదాపుగా ఎక్కువ మంది రూ.2వేల నోటును తీసుకోవటానికి ఇష్టపడని పరిస్థితి. ఒకవేళ తీసుకోవాలంటే బిల్లు రూ.1500 దాటితే ఓకే అనేస్తున్నారు. దీంతో.. ఉత్సాహంతో పింక్ నోట్ ను సొంతం చేసుకున్న వారంతా.. ఇప్పుడు వాటిని చెల్లుబాటు చేసుకోలేక కిందామీదా పడుతున్న దుస్థితి. మార్కెట్లోకి కొత్త రూ.500 నోట్లు విరివిగా వస్తే తప్పితే కానీ పింక్ నోటు తిప్పలు తప్పవని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News