స్థానిక విజ‌యంపై వైసీపీలో త‌లోమాట‌.. ఏమ‌న్నారంటే!

Update: 2021-11-18 17:30 GMT
తాజాగా రాష్ట్రంలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌లు.. నెల్లూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. మ‌రీ ముఖ్యంగా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ఈ విజ‌యాల‌పై వైసీపీలోనే భిన్న‌మైన వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులు.. ఆయ‌న విధేయులు.. ఈ విష‌యం కేవ‌లం జ‌గ‌న్‌తోనే సాధ్య‌మైంద‌ని.. ఆయ‌న ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాల‌తోనే ఈ విజయం వ‌చ్చింద‌ని వారు చెబుతున్నారు. ఇదంతా కూడా ప్ర‌భుత్వం సాధించిన విజ‌య‌మేన‌ని అంటున్నారు.

అయితే.. వైసీపీలోనేమ‌రోవ‌ర్గం.. ఈ విజ‌యాన్ని భూత‌ద్దంలో చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేస్తు న్నారు. నిజానికి ఇది పెద్ద విజ‌యం కాద‌ని.. నిజంగానే ప‌థ‌కాలు ఎఫెక్ట్ చూపాయ‌ని భావిస్తే.. మొత్తంగా క్లీన్ స్వీప్ చేసి ఉండాల‌ని.. కానీ, అలా జ‌ర‌గ‌లేద‌నే విష‌యాన్ని ప్ర‌ధానంగా ఎత్తి చూపుతున్నారు.

అంతేకాదు.. టీడీపీకి, వైసీపీకి ప‌డిన ఓట్ల శాతాన్ని ప‌రిశీలించాల‌ని వారు చెబుతున్నారు. ప్ర‌స్తుతానికి ఈ రెండు పార్టీల‌కు మ‌ధ్య కేవ‌లం ఓట్ల శాతం 2 మాత్ర‌మే క‌నిపిస్తోంద‌ని వారు అంటున్నారు. ఇదే విష‌యాన్ని వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కూడా స్ప‌ష్టం చేశారు.

అంతేకాదు.. ఆయ‌న ఏకంగా.. వైసీపీపై అసంతృప్తి పెరుగుతున్న విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించారు. చాలా మునిసిపాలిటీల్లో టీడీపీ గ‌ట్టిపోటీ ఇచ్చింది. కొన్ని చోట్ల ఒక‌రిద్ద‌రి మెజారిటీతోనే మునిసిపాలిటీల‌ను ద‌క్కించుకుంది వైసీపీ. ఈ నేప‌థ్యంలో గ‌త ఆరు మాసాల కాలంలో టీడీపీ పుంజుకుంద‌నే భావ‌న వైసీపీ వ‌ర్గాల్లోనేవినిపిస్తుండ‌డం ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.

అంతేకాదు.. అధికార పార్టీలోనూ నేత‌ల మ‌ద్య స‌ఖ్య‌త లేద‌నే విష‌యం కొండ‌ప‌ల్లి, జ‌గ్గ‌య్య పేట స‌హా.. ద‌ర్శి వంటి మునిసిపాలిటీల్లో స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని.. వ‌చ్చే రెండున్న‌రేళ్ల‌లో జ‌గ‌న్ ఈ విష‌యంపై దృష్టి పెట్ట‌క‌పోతే.. ఈ వివాదాలు మ‌రింత పెరిగి.. ఇబ్బందుల‌కు దారితీసే అవ‌కాశం ఉంద‌ని కూడా హెచ్చరిస్తున్నారు.

ప్ర‌స్తుతం ల‌భించిన విజ‌యాన్ని బ‌లుపు కంటే కూడా వాపుగానే భావిస్తున్న‌వారు వైసీపీనే క‌నిపిస్తుండ‌డం.. భిన్న‌మైన వాద‌న‌లు తెర‌మీదికి వ‌స్తుండ‌డం.. ఆస‌క్తిగా మారింది. నిజానికి కొన్నాళ్లుగా ప్ర‌జ‌లు పెట్రోల్ చార్జీల ఎఫెక్ట్‌, విద్యుత్ చార్జీల భారంతో ఒకింత ఇబ్బందులు ప‌డుతున్నారు.

దీనితాలూకు ఎఫెక్ట్ ఖ‌చ్చితంగా ఇప్పుడు వ‌చ్చిన ఫ‌లితాల్లో క‌నిపించింద‌నేది వైసీపీ నేత‌ల మాట‌. దీనిని బ‌ట్టి.. ఇప్పుడు ద‌క్కిన విజ‌యాన్ని పార్టీ అధిష్టానం నిశితంగా గ‌మ‌నించి స‌రిచేసుకుంటేనే భ‌విష్య‌త్తు ఉంటుంద‌నే సూచ‌న‌లు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News