వారం ముందు చేరిన వాళ్లకు ఎమ్మెల్సీ పదవా!

Update: 2019-08-12 06:22 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ పదవుల కేటాయింపు ఆ పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. జగన్ వెంట మొదటి నుంచి నడిచిన వారికి కాకుండా… ఆఖర్లో - ఇక జగన్ గెలవడం ఖాయమనే అంచనాలు ఏర్పడ్డాకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారికి ఎమ్మెల్సీ పదవులు దక్కుతుండటం చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్యేల రాజీనామాలతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవుల నామినేషన్ లో కర్నూలు జిల్లాకు చెందిన ఒక నేతకు దక్కిన ప్రాధాన్యత పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆశ్చర్యపోతూ ఉన్నాయి. ఆయన ఎన్నికల నోటిఫికేషన్ కు సరిగ్గా వారం రోజుల ముందు పార్టీ తీర్థం పుచ్చుకున్న వారు కావడం గమనార్హం.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులూ ఆయన అక్కడే ఉన్నారు. అయితే తెలుగుదేశం అధికారంలోకి వచ్చాకా ఆయన అటు వైపు వెళ్లారు. తెలుగుదేశంలో నామినేటెడ్ పోస్టు కోసం తెగ ప్రయత్నించారు. అయితే చంద్రబాబు కూడా ఆయనను పట్టించుకోలేదు. చివర్లో మాత్రం ఏదో నామమాత్రపు పదవిని ఇచ్చారు. ఆర్టీసీలో రీజినల్ పదవిని ఆయనకు కట్టబెట్టారు. చంద్రబాబు ఆయనను అంతగా లైట్ తీసుకున్నారు.

ఆయన ఔట్ డేటెడ్ లీడర్ అనే భావనను చంద్రబాబు వ్యక్తం చేశారు. ఆ పదవిని కూడా ఆయన వదల్లేదు. తీసుకున్నారు. తీరా ఎన్నికల నోటిఫికేషన్ వారంలో వస్తుందనంగా జగన్ వైపు చేరారు. టీడీపీ ఇచ్చిన పదవికి రాజీనామా చేశారు. తను చాలా త్యాగం చేసినట్టుగా ఆయనే చెప్పుకున్నారు. ఆ పదవి చాలా చిన్నది. అదీ ఆయనే చెప్పారు.

ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీ పదవిని పొందుతున్నారాయన. అయితే జగన్ పార్టీలో మొదటి నుంచి ఆయన వెంట నిలిచిన వారు ఉన్నారు. పదేళ్ల నుంచి జగన్ తో కష్టనష్టాల్లో పాలుపంచుకున్న వాళ్లున్నారు. అలాంటి వారెవరికైనా ఆ పదవి దక్కాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆఖర్లో తన వద్దకు వచ్చిన వారికి జగన్ ఇచ్చిన ప్రాధాన్యం పట్ల అనేక మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇలాంటి వారి బదులుకే అదే సామాజికవర్గానికే చెందిన వారికే వేరే ఎవరైకినా - మొదటి నుంచి వెంట నిలిచిన వారికి జగన్ ప్రాధాన్యతను ఇవ్వాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Tags:    

Similar News