ప‌వ‌న్ భేటీపై డౌట్లు మొద‌ల‌య్యాయి

Update: 2015-11-13 05:58 GMT
ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు - జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తాజా భేటీ ఏపీ రాజ‌కీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు మూడుగంట‌ల పాటు జ‌రిగిన ఈ స‌మావేశంలో రైతులు - ఏపీకి ప్ర‌త్యేక హోదా - ప్యాకేజీ - అమ‌రావ‌తి నిర్మాణం వంటివి చ‌ర్చ‌కొచ్చాయి. బాబుతో భేటీ అనంత‌రం తానెందుకు స‌మావేశ‌మ‌యింది, ఏం మాట్లాడుకున్నామ‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు. అయితే ఈ భేటీపై రాజ‌కీయ‌వ‌ర్గాల విశ్లేష‌ణ భిన్నంగా ఉంది.

వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ముందు రోడ్లు వేయాల్సి ఉంటుంది. ఉండవల్లి నుండే ప్రధాన రహదారి నిర్మాణమవుతుంది. ఇక్కడ నుండి ఒకరోడ్డు పెనుమాక వైపునకు, మరో రోడ్డు మందడం వైపునకు వెళుతుంది. రాజధాని నిర్మాణానికి ఈ రోడ్ల నిర్మాణం అత్యంత కీలకం. ఆయా గ్రామాలకు చెందిన రైతులే గతంలో పవన్‌ కళ్యాణ్‌ ను కూడా కలుసుకున్నారు. ప‌వ‌న్‌ కూడా నేరుగా ఆయా గ్రామాల్లోనే పర్యటించారు. అభివృద్ధికీ అడ్డుపడబోమనీ అయితే...భూ సేకరణకు వెళితే సహించేది లేదని హెచ్చరించారు. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే ఈ గ్రామాల్లోని వారు ఓ ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు. వారు భూములు ఇచ్చేందుకు స‌సేమిరా అంటున్న ప‌రిస్థితి ఉంది.

అయితే ప్ర‌భుత్వం శ‌ర‌వేగంగా భూ సేక‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతోంది. అయితే అంత‌కుముందు భూ స‌మీక‌ర‌ణ కోసం ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం పలుసార్లు ఆయా రైతులతో చర్చించినా వారు సమీకరణ కింద భూములిచ్చేందుకు సిద్ధపడలేదు. దీంతో కనీసం రోడ్లు వేసుకునేందుకైనా అవసరమైన భూములను సమీకరణ పద్ధతిలో ఇప్పించే దిశగా ఒప్పించేందుకు పవన్‌ కళ్యాణ్‌ తో చంద్ర‌బాబు సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో రాజధానికి భూ సమీకర‌ణలో భూములు ఇవ్వని ఓ సామాజిక వర్గం రైతులతో మాట్లాడి ఒప్పించే అంశం వారిమధ్య చర్చ సాగినట్లుగా ప‌లువురు విశ్లేషిస్తున్నారు.
Tags:    

Similar News