అవకాశవాదానికి నిలువెత్తు నిదర్శనం మీ అమ్మే

Update: 2015-07-25 18:03 GMT
 కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి ఇతర పార్టీల్లో చేరిన కె.కేశవరావు, డి.శ్రీనివాస్, బొత్స సత్యనారాయణలది అవకాశవాదమని, వారు అవకాశవాదులంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవకాశ వాదానికి నిలువెత్తు నిదర్శనం మీ అమ్మ సోనియా గాంధీయేనని, ఆమె అవకాశ వాదానికి కొమ్ము కాసిన నువ్వు కూడా అవకాశవాదివేనని కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

 చరిత్రలో ఏ రాష్ట్రమూ ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వని విధంగా ఏకంగా 42లో 35 ఎంపీ సీట్లను కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందని వారంతా గుర్తు చేస్తున్నారు. రెండుసార్లూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఆంద్రప్రదేశ్ మాత్రమే కీలక పాత్ర పోషించిందని గుర్తు చేస్తున్నారు. భవిష్యత్తులోనూ కాంగ్రెస్ పార్టీకి ఏపీనే కంచుకోటగా ఉండేదని కూడా ఆయా నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ను అడ్డగోలుగా విభజించడం ద్వారా కూర్చున్న చెట్టును నరుక్కున్న అవివేకిలా సోనియా, రాహుల్ వ్యవహరించారని, తెలంగాణలో నాలుగు సీట్లు తెచ్చుకోవడం.. తెలంగాణ తల్లిగా ముద్ర తెచ్చుకోవాలనే ఆరాటంలో సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు పట్టుబట్టారని గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజనను చేసినా తప్పు లేదని, కానీ దానికి ఒక క్రమ పద్ధతిలో ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకుండా చేసి ఉన్నా పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని వివరిస్తున్నారు.

 సోనియా, రాహుల్ చేసిన అవివేకి పనుల కారణంగానే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ నేతలు చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెదిరిపోవాల్సి వచ్చిందని, ఎందులోకి వెళ్లలేని నాయకులు ఆయా పార్టీల్లోనే నిస్సహాయంగా నిస్తేజంగా మిగిలిపోవాల్సి వచ్చిందని, ఇందుకు పూర్తి బాధ్యత సోనియా, రాహుల్ లదేనని, దానిని కప్పిపుచ్చి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నాయకులను అవకాశవాదులని ముద్ర వేయడం అవివేకానికి పరాకాష్ఠ అని మండిపడుతున్నారు. సోనియా, రాహుల్ లు ఇటువంటి నిర్ణయం తీసుకోకపోయి ఉంటే.. కాంగ్రెస్ పార్టీని కొన్ని వేల కిలోమీటర్ల మేర బొంద పెట్టకుండా ఉండి ఉంటే నాయకులు అసలు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్లి ఉండేవారా అని నిలదీస్తున్నారు.
Tags:    

Similar News