15 ఏళ్ల క్రితం విడాకులు.. ఇప్పుడు మ‌ళ్లీ పెళ్లికి సిద్ధం.. కోర్టు ఏమ‌న్న‌దో తెలుసా?

Update: 2021-07-11 09:30 GMT
మ‌నిషి ఆలోచ‌న ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. అందుకే.. ప్రాణంగా ప్రేమించుకున్నవారు విడిపోతారు. బ‌ద్ధ‌శ‌త్రువులు కూడా ఒక్క‌ట‌వుతారు. అయితే.. పెళ్లి చేసుకొని కొన్నేళ్లు కాపురం చేసి, విడాకులు తీసుకున్న‌వారు మ‌ళ్లీ క‌ల‌వ‌డం అనేది మాత్రం అత్యంత అరుదు. ఇలాంటి ఘ‌ట‌నే తాజాగా హైద‌రాబాద్ లో చోటు చేసుకుంది.

న‌గ‌రానికి చెందిన ఓ జంట పెళ్లి చేసుకొని సుమారు 20 సంవ‌త్స‌రాల‌పాటు కాపురం చేసింది. ఈ క్ర‌మంలో వారికి ఇద్ద‌రు పిల్ల‌లు క‌లిగారు. ఆ త‌ర్వాత కూడా సంసారం సాఫీగానే సాగింది. కానీ కొన్నాళ్ల త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌లు మొద‌ల‌య్యాయి. అవి రాజీ కుదుర్చుకోలేనంత స్థాయికి చేరుకున్నాయి. దీంతో.. విడిపోవ‌డ‌మే అంతిమ ప‌రిష్కారం అనుకున్నారు. కోర్టును ఆశ్ర‌యించారు. విచారించిన‌ న్యాయ‌స్థానం.. విడాకులు మంజూరు చేసింది.

ఇది జ‌రిగి దాదాపు 15 సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాయి. ఈ గ్యాప్ లో జీవితం ఎంతో మారిపోయింది. పిల్ల‌లు ఎదిగారు. వాళ్ల‌కు పెళ్లిళ్లు అయ్యాయి. విదేశాల్లో స్థిర‌ప‌డ్డారు. వీళ్లు మాత్రం విడిగా ఒంట‌రి జీవితాన్ని గ‌డుపుతున్నారు. బంధం తెగిపోయిన త‌ర్వాతే దాని విలువ తెలుస్తుంద‌ని అంటారు. వీళ్ల విష‌యంలోనూ అదే జ‌రిగింది. తాము చేసిన త‌ప్పులు గుర్తుకు రాసాగాయి. ఆ త‌ప్పుల వ‌ల్ల కోల్పోయిన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ మ‌ద‌న‌ప‌డ్డారు. కుమిలిపోయారు. అన్నీ ఆలోచించి, మ‌ళ్లీ ఎందుకు ఒక్క‌టి కాకూడ‌దు? అని ప్ర‌శ్నించారు. మ‌న‌సు కూడా ఓకే చెప్పింది. ఇద్ద‌రూ క‌లుసుకున్నారు. బాధ‌లు పంచుకున్నారు. ప‌ర‌స్ప‌రం త‌ప్పులు క్ష‌మించుకున్నారు.

ఆ త‌ర్వాత‌.. ఎక్క‌డైతే విడిపోయారో అక్క‌డికే వెళ్లారు. కోర్టు చెంత‌కు వెళ్లి.. తాము మ‌ళ్లీ క‌ల‌వాల‌ని అనుకుంటున్నామ‌ని, అనుమ‌తించాల‌ని కోరారు. ఆ దంప‌తుల వ‌య‌సు ప్ర‌స్తుతం 70 ద‌గ్గ‌ర్లో ఉంది. ఈ వ‌య‌సులో తోడు అవ‌స‌రం అన్న వాస్త‌వాన్ని గుర్తించిన న్యాయ‌స్థానం.. సానుకూలంగా స్పందించింది. ఈ కేసును లోక్ అదాల‌త్ చెంత‌కు పంపించింది. శ‌నివారం ఈ కేసు పవిచారించిన బెంచ్‌.. ఈ మాజీ దంప‌తులు ఒక్క‌ట‌య్యేందుకు అంగీక‌రించింది.
Tags:    

Similar News