కేసీఆర్ ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లే ధైర్యం ఉందా..?

Update: 2018-04-17 13:18 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ పై కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి మొద‌లుపెట్టింది. ముఖ్య‌మంత్రి హోదాలో ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలపై హైకోర్టు మొట్టికాయలు వేసిన నేప‌థ్యంలో..కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత - మాజీ మంత్రి డీకే అరుణ విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి - సంపత్‌ ల ఎమ్మెల్యే సభ్యత్వ రద్దు చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామ‌ని ఆమె తెలిపారు. కేసీఆర్ సర్కార్‌ కు కోర్ట్ తీర్పు చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి అరుణ పేర్కొన్నారు.

కేసీఆర్ సర్కార్ కు కోర్ట్ మొట్టికాయలు తిని తిని మెద‌డు మొద్దు బారిపోయిందని డీకే అరుణ ఎద్దేవా చేశారు. `కేసీఆర్‌ కు ఒక్క రోజు కూడా పదవిలో కొనసాగే నైతికత లేదు. కేసీఆర్‌ కు ఏమాత్రం సిగ్గు ఉన్నా తెలంగాణ వాడివైతే రాజీనామా చేయాలి. కేసీఆర్ కు ఏమాత్రం ధైర్యం ఉన్నా పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి. లేకుంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వచ్చినా మేము సిద్ధం. కోర్ట్ తీర్పుపై స్పీకర్ సరైన విధంగా స్పందించ‌కపోతే .. ప్రజలే రాబోయే రోజుల్లో సరైన బుద్ది చెబుతారు` అని అరుణ హెచ్చ‌రించారు. మంత్రి జూపల్లి ఇసుక మాఫియాలో మునిగి తేలుతున్నారని అరుణ ఆరోపించారు. `జూపల్లి అండతో జిల్లాలో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు అరుకాయలుగా కొనసాగుతోంది. బ్యాంక్స్ ను ముంచడంలో జూపల్లి అరితేరాడు. జూపల్లి ఇసుక అక్రమ రవాణాపై స్థానిక ప్రజలు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మంత్రులు చేసే అవడాలు సీఎం కేసీఆర్ కు కనిపించడం లేదా .. లేక మంత్రులకు రాష్ట్ర దోపిడీకి రాసిచ్చాడా? నేను ప్రగతి భవన్ లో కూర్చొని దోచుకుంటున్నా .. మీరు జిల్లాల్లో దోచుకొండని మంత్రులకు చెప్పాడా?` అని విరుచుకుప‌డ్డారు.

ఆకమ ఇసుక రవాణా ఎలా జరుగుతుందో చూపిస్తాం .. జూపల్లి వచ్చేందుకు సిద్ధమా అంటూ డీకే అరుణ విరుచుకుప‌డ్డారు. జూపల్లి తెలంగాణ  ఖనిజ సంపదను ఆంధ్రకు తరలిస్తున్నారని తెలంగాణపై ఇదేనా మీకు ఉండే చిత్తశుద్ధి అని ప్ర‌శ్నించారు. `వివాదాల్లో ఉన్న భూమిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్స్ తీసుకోవడం ఎక్కడి నీతి? బ్యాంకులను దోచుకోవడం కాదా? జూపల్లి తాను బ్యాంకులను ముంచింది చాలదని .. ఇప్పుడు కొడుకులను కూడా రంగులోకి దించాడు. జూపల్లి కొడుకులు తండ్రికి తగ్గ తనయులుగా నిరూపించుకుంటున్నారు. కేసీఆర్ తక్షణం జూపల్లి ని మంత్రివర్గం నుంచి తప్పించాలి. ద‌ళితుడైన‌ రాజయ్యను మంత్రి పదవి నుంచి తప్పించిన కేసీఆర్ .. జూపల్లి తన బందువని ఉపేక్షిస్తున్నారా?` అని అరుణ‌ ప్ర‌శ్నించారు.
Tags:    

Similar News