ఆమె పాద‌యాత్ర కేసీఆర్ మ‌న‌సు క‌రిగిస్తుందా?

Update: 2016-07-19 08:12 GMT
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ స‌రికొత్త నిర‌స‌న‌కు శ్రీ‌కారం చుట్టారు. గ‌ద్వాలను జిల్లాగా ప్ర‌క‌టించాల‌న్న డిమాండ్ తో ఆమె పాద‌యాత్ర మొద‌లు పెట్టారు. పాల‌మూరులో గ‌ద్వాల‌ను జిల్లాను చేయాల‌న్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఇటీవ‌ల జిల్లాల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో గ‌ద్వాల‌కు చోటు ద‌క్కుతుంద‌ని చాలామంది స్థానికులు ఎదురుచూశారు. కానీ, వారి ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. కొత్త జిల్లాల జాబితాలో గ‌ద్వాల‌కు చోటు ల‌భించ‌లేదు. దీంతో కొంత‌కాలంగా గ‌ద్వాల‌ను జిల్లాను చేయాల‌ని ఉద్య‌మాలు - నిర‌స‌న‌లు ఊపందుకున్నాయి. ఈ ఆందోళ‌న‌ల‌కు కాంగ్రెస్ నేత‌లు ప‌లువురు మ‌ద్దతు ప‌లికారు. అనేక ఆందోళ‌న‌ల అనంత‌రం ఇప్పుడు ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ చేప‌ట్టారు.

గ‌ద్వాల‌ను జిల్లాగా చేయాల‌ని అరుణ ప్ర‌భుత్వాన్ని కొంత‌కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ద‌స‌రాకు కొత్త జిల్లాలు అమ‌లులోకి వ‌స్తాయని కేసీఆర్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. దీనికి త‌గ్గ‌ట్టుగా మండ‌లాల విభ‌జ‌న కూడా జ‌రిగిపోయింది. ఈ విష‌యంలో స్థానికుల‌ ఆకాంక్ష‌లు నెర‌వేర్చేలా - గ‌ద్వాల‌ను జిల్లాగా ప్ర‌క‌టించాల‌న్న డిమాండ్‌ తో పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు డీకే. ఈ పాద‌యాత్ర‌లో ఆలంపూర్ ఎమ్మెల్యే సంప‌త్ కుమార్ భాగ‌స్వామి అయ్యారు. గ‌ద్వాల‌లోని జ‌మ్ములమ్మ ఆల‌యం వ‌ద్ద మొద‌లైన డీకే పాద‌యాత్ర ఎలాంటి ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుందో చూడాలి.

గ‌ద్వాల‌ - ఇటిక్యాల‌ - మాన‌వ‌పాడు - ఆలంపూర్ త‌దిత‌ర ప్రాంతాల మీదుగా 30 గ్రామాల్లో దాదాపు 60 కిలోమీట‌ర్ల మేర అరుణ‌ పాద‌యాత్ర సాగ‌నుంది. ఈనెల 22 వ‌ర‌కు యాత్ర కొన‌సాగుతుంది. మ‌రి ఈ యాత్ర ద్వారా గ‌ద్వాల‌ను జిల్లాగా ప్ర‌క‌టించాల‌న్న డీకే ప్లాన్ స‌క్సెస్ అవుతుందా?  లేదా అన్న‌ది ద‌స‌రాకు తేలిపోనుంది.   తెలుగు రాష్ట్రాల్లో రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె ష‌ర్మిళ త‌రువాత భారీ పాద‌యాత్ర చేస్తున్న మ‌హిళా నేత‌ డీకే అరుణే అని చెప్పుకోవాలి. ష‌ర్మిళ ఓదార్పు యాత్ర చేయ‌గా అరుణ గ‌ద్వాల జిల్లాకోసం పాద‌యాత్ర చేస్తున్నారు. మ‌రి ఒక మ‌హిళ కాళ్లు నొప్పుల‌య్యేలా పాద‌యాత్ర చేస్తున్నందుకైనా మ‌న‌సు క‌రిగి కేసీఆర్ గ‌ద్వాల జిల్లాను ప్ర‌క‌టిస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News