కాంగ్రెస్ పెద్దాయ‌న‌కు మంట పుట్టిస్తున్న ఫైర్‌ బ్రాండ్ నేత‌

Update: 2018-08-23 16:37 GMT
కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట‌లు తారాస్థాయికి చేరిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే జిల్లాల స్థాయిలో సాగుతున్న ఈ ర‌చ్చ తారాస్థాయికి చేరి ఏకంగా రాష్ట్ర కార్యాల‌యం వేదిక‌గా స‌వాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ఇప్పటికే ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో ఇద్దరు ముఖ్యనేతలు జైపాల్‌ రెడ్డి - డీకే అరుణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. టీడీపీలో ఉన్న రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ లోకి తీసుకురావడంలో జైపాల్‌ రెడ్డి కీలకపాత్ర వహించారని, అదే రీతిలో బీజేపీలో ఉన్న నాగం జనార్దన్‌ రెడ్డిని పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నించారని డీకే అరుణ వర్గం ఆరోపించింది. పార్టీలోకి నాగం రాకను వ్యతిరేకించిన డీకే అరుణ పార్టీ నేత‌లు  ఎంపీ నంది ఎల్లయ్య - ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి - మరో ముగ్గురిలతో క‌లిసి ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిసి జైపాల్‌ రెడ్డిపై.. డీకే అరుణ ఫిర్యాదు చేసినట్టు వార్త‌లు వ‌చ్చాయి. నాగం రాక‌ను వ్యతిరేకిస్తున్న జిల్లా నేత‌ల‌తో క‌లిసి .. రాహుల్ తో ప్రత్యేకంగా స‌మావేశ‌మైన డీకే అరుణ .. ఆయన రాక వల్ల కలిగే న‌ష్టాల‌ను రాహుల్ కు వివ‌రించారు.

ఇలా గ‌తంలో అంత‌ర్గ‌తంగా తిరుగుబాటు జెండా ఎగుర‌వేసిన డీకే అరుణ తాజాగా బ‌హిరంగంగానే జైపాల్ రెడ్డిపై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేశారు. కేంద్రమాజీ మంత్రి జైపాల్ రెడ్డికి మహబూబ్ నగర్ సీటు ఇవ్వవద్దని డీకేఅరుణ క‌ల‌కలం పుట్టించే డిమాండ్లు ఇచ్చారు. ఆయనకు బదులు బీసీలకు ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఇంతేకాకుండా...త‌న కుమార్తెకు సీటు ఇవ్వాల‌ని కోర‌నున్న‌ట్లు తెలిపారు. పార్టీలో చేరిన రేవంత్ రెడ్డితో త‌న‌కు స‌మ‌స్య ఏమీ లేద‌ని - జైపాల్‌ తో ఏజ్ గ్యాప్ స‌మ‌స్య‌లే అస‌లు కార‌ణ‌మ‌ని ఆమె తెలిపారు. తాను పీసీసీ రేసులో ఉన్నానని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, ఈ సంద‌ర్భంగానే తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై మండిప‌డ్డారు. కేసీఆర్ ప్రచారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతార‌నే విష‌యం తప్పుడు ప్రకటనలతో అర్థమ‌వుతుందన్నారు. చేస్తున్నది శూన్యం .. ప్రచార ఆర్భాటం మాత్రం దేశవ్యాప్తంగా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

భూమి లేని వారి ఫొటోలతో రైతు భీమా కల్పించామని చెప్పుకోవడం సిగ్గుచేటని సీఎం కేసీఆర్ తీరును అరుణ ఎండ‌గ‌ట్టారు. భర్త ఫోటోను మార్చి పరాయి వ్యక్తి ఫొటోను ఆమె భుజంపై చెయ్యి వేసి ప్రచురించడం ఆ మహిళను కించపరచ‌డమేన‌ని తెలిపారు. యాడ్ ఏజెన్సీ పై చర్యలతో కేసీఆర్ చేతులు ఫులుపుకుంటే సరిపోదని, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఆ కుటుంబానికి కేసీఆర్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఆ కుటుంబానికి మూడెకరాల భూమిని కేటాయించాలని కోరారు.
Tags:    

Similar News