కేటీఆర్‌ ను మహిళా మంత్రి అనుకోవాలా?

Update: 2017-11-29 04:16 GMT
తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా స‌మ‌న్వ‌యం చేస్తున్న గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ ప్రెన్యూర్‌ షిప్ స‌మ్మిట్ కార‌ణంగా రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఇటు సామాన్యుల నుంచే కాకుండా అటు రాజ‌కీయవ‌ర్గాల నుంచి కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చేందుకు కార‌ణంగా మారింది. విప‌క్ష నేత‌ల‌ను పక్క‌న పెట్ట‌డం - టీఆర్ ఎస్ సొంత షో గా మారిపోవ‌డం వంటి కార‌ణాలు ఆయా రాజ‌కీయ పార్టీల్లో అస‌హనానికి కార‌ణంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా మాజీ మంత్రి - కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే డీకే అరుణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రపంచ వాణిజ్య సమ్మిట్‌ లో పాల్గొనేందుకు క్యాబినెట్‌ లో మహిళా మంత్రి లేకపోవడం వల్ల మున్సిపల్‌ - పరిశ్రమలు - ఐటీ శాఖ మంత్రి పాల్గొంటున్నారని, ఆయనను మహిళా మంత్రి అనుకోవాలా? అని ఎమ్మెల్యే డీకే అరుణ ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో గొప్ప సదస్సు జరుగుతుంటే...మహిళా ప్రజాప్రతినిధి లేకపోవడంతో రాష్ట్రానికి అవమానకరమని డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో మహిళా మంత్రి ఉంటే ఆమె ఈ సమ్మిట్‌ లో పాలు పంచుకోవాల్సి ఉండేదన్నారు. కేటీఆర్‌ మాత్రం సమ్మిట్‌ లో పాల్గొంటున్నారని, కేటీఆర్‌ ను మహిళా మంత్రి అనుకోవాలా? అని ఎద్దేవా చేశారు. 150 దేశాలకు చెందిన 15వందల ప్రతినిధుల్లో 52 శాతం మహిళలు పాల్గొంటున్నారని అలాంటి ప్ర‌ఖ్యాత కార్య‌క్ర‌మంలో మహిళల ఉనికే లేకుండా చేసిందన్నారు. నగర మేయర్‌ కు లేని ప్రోటోకాల్‌...కేటీఆర్‌ కు మాత్రమే ఎందుకు? సీఎం కొడుకు కావడం వల్లనేనా? ఈ వివక్ష ఎందుకు? అని ప్రశ్నించారు. కాగా, మెట్రో త‌మ ఘ‌నత‌గా టీఆర్ ఎస్ ప్ర‌చారం చేసుకోవడం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌న్నారు.

కాంగ్రెస్‌ హయాంలో పునాది రాయి వేస్తే ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పనులు ప్రారంభిస్తే...2014లో మెట్రోను పూర్తి చేయాల్సి ఉందని డీకే అరుణ అన్నారు. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం అనాలోచన నిర్ణయం వల్ల మెట్రో ఆలస్యమైందన్నారు. దీంతో 3వేల 500 కోట్ల రూపాయల భారం పడిందన్నారు. ప్రతి ప్రాజెక్టును ఆలస్యం చేసి...కాంగ్రెస్‌కు క్రెడిట్‌ రాకుండా చేసిందని ఆమె మండిప‌డ్డారు. గతంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కూడా ఇదే విధంగా చేసిన ఆ నెపాన్ని కాంగ్రెస్‌ పై నెట్టివేసిందని ఆక్షేపించారు.
Tags:    

Similar News