త‌మిళ‌నాడులో కాంగ్రెస్‌.. డీఎంకే డీల్ ప‌క్కానా?

Update: 2019-02-21 05:05 GMT
మ‌రి కొద్ది వారాల్లో లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల కానున్న వేళ‌.. అంత‌కు ముందే వివిధ పార్టీల మ‌ధ్య పొత్తు లెక్క‌లు స్పీడ్ అందుకున్నాయి. మిగిలిన రోజుల్లో ఎన్ని తిట్లు తిట్టుకున్నా.. ఎన్నిక‌ల్లో మాత్రం క‌లిసి పోటీ చేసే వైనాన్ని ఈసారీ బీజేపీ.. శివ‌సేన‌లు పాటించాయి. ఎన్నిక‌ల వ‌ర‌కూ బీజేపీ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టే శివ‌సేన‌.. ఎన్నిక‌ల్లో మాత్రం ఆ పార్టీతోనే క‌లిసి బ‌రిలోకి దిగే అల‌వాటుకు త‌గ్గ‌ట్లే.. ఇటీవ‌ల రెండు పార్టీల మ‌ధ్య పొత్తు లెక్క‌లు ఒక కొలిక్కి రావ‌టం తెలిసిందే. మ‌హ‌రాష్ట్రలో రెండు పార్టీల మ‌ధ్య సీట్ల ఒప్పందం కుదిరిన వైనం తెలిసిందే.

మ‌రోవైపు త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే.. బీజేపీల మ‌ధ్య సీట్ల లెక్క‌లు ఒక కొలిక్కి వ‌చ్చిన వేళ‌.. మ‌రో ఆస‌క్తిక‌ర పొత్తు ఫైన‌ల్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. త‌మిళ‌నాడులో విపక్ష డీఎంకే కూట‌మితో.. కాంగ్రెస్ జ‌త క‌ట్ట‌నుంది. ఇందుకు సంబంధించిన పొత్తు చ‌ర్చ‌లు ఫ‌ల‌వంత‌మైన‌ట్లుగా చెబుతున్నారు.

త‌మిళ‌నాడులో మొత్తం 39 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. మ‌రో స్థానం పుదుచ్చేరి ప‌రిధిలో ఉంది. ఈ రెండింటిలో క‌లిపి కాంగ్రెస్ కు ప‌ది సీట్లు ఇచ్చేందుకు డీఎంకే స‌ముఖంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. అయితే..కాంగ్రెస్ పార్టీ ప‌ద‌హారు సీట్ల‌ను కోరుతున్న‌ట్లుగా తెలుస్తోంది.అయితే.. అన్ని సీట్లు ఇవ్వ‌టం సాధ్యం కాద‌ని తేల్చిన డీఎంకే.. ప‌ది సీట్ల‌కు ఓకే చెప్పిన‌ట్లుగా స‌మాచారం. ఇదిలా ఉండ‌గా.. తాము ఎన్ని సీట్ల నుంచి పోటీ చేసే విష‌యంపై స్ప‌ష్ట‌త రాలేద‌ని.. మిత్ర‌ప‌క్షాల‌తో మాట్లాడిన అనంత‌రం ఫైన‌ల్ లెక్క చెబుతామ‌ని డీఎంకే చీఫ్ స్టాలిన్ చెబుతున్నారు.

మ‌రోవైపు త‌మిళ‌నాడు కాంగ్రెస్ పార్టీ నేత వేణుగోపాల్ మాట్లాడుతూ.. క‌లిసిక‌ట్టుగా నిర్ణ‌యం తీసుకుంటామ‌ని.. తాము ఈసారి ఎక్కువ సీట్ల‌లో గెల‌వ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. త‌మిళ‌నాడులో పొత్తుపై రాహుల్ త‌మ‌కు సూచ‌న‌లు చేశార‌ని.. అందుకు త‌గ్గ‌ట్లే డీఎంకేతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లుగా వేణుగోపాల్ వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్‌కు త‌మిళ‌నాడులో తొమ్మిది స్థానాలు. పుదుచ్చేరి లోనిఒక సీటు తీసుకోవాల‌ని స్టాలిన్ సూచించిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇందుకు కాంగ్రెస్ సైతం ఓకే అన్న‌ట్లుగా స‌మాచారం. మ‌రోవైపు డీఎంకే మిత్ర‌ప‌క్షాల‌కు మ‌రో ఐదు సీట్లు కేటాయించి.. తాను పాతిక సీట్ల‌లో పోటీ చేయాల‌ని స్టాలిన్ భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. డీఎంకే మిత్ర‌ప‌క్షాలుగా సీపీఐ.. సీపీఎం.. వైకో నేతృత్వంలోని ఎండీఎంకే.. వీసీకే.. ఇండియ‌న్ యూనియ‌న్ ముస్లిం లీగ్ త‌దిత‌ర పార్టీలు ఉన్నాయి. వీట‌న్నింటితో క‌లిపి ఐదు స్థానాల్ని ఇచ్చేందుకు స్టాలిన్ సుముఖంగా ఉన్నారు.
Tags:    

Similar News