‘బలపరీక్ష’ మీద కోర్టుకు వెళితే రద్దేనట

Update: 2017-02-20 07:18 GMT
నాటకీయ పరిణామాల నేపథ్యంలో సాగిన పళనిస్వామి ప్రభుత్వ బల నిరూపణ పరీక్షపై ఆసక్తికర వాదన ఒకటి మొదలైంది. బలపరీక్ష సక్రమంగా జరగలేదని.. ప్రధాన ప్రతిపక్షం సభలో లేకుండా చేసి.. పరీక్ష నిర్వహించటం ఏమిటన్న ప్రశ్నతో పాటు.. స్పీకర్ తీరును పలువురు మాజీ స్పీకర్లు తీవ్రంగా తప్పు పడుతున్నారు. అదే సమయంలో.. బలపరీక్ష మీద కోర్టుకు వెళితే.. బలపరీక్ష చెల్లకుండా పోతుందన్న వాదనను వినిపిస్తున్నారు.

ఇలాంటి అభిప్రాయం వ్యక్తమవుతున్న వేళ.. బలనిరూపణ పరీక్ష జరిగిన తీరుపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన ప్రధాన ప్రతిపక్షం డీఎంకే. తాజాగా బలపరీక్ష జరిగిన తీరుపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  అధికారపార్టీ తర్వాత అత్యధిక సభ్యులున్న డీఎంకే చేసిన రహస్య ఓటింగ్ జరపాలన్న డిమాండ్ ను స్పీకర్ ఆమోదించకపోవటాన్నిపలువురు తప్పు పడుతున్నారు.

పరీక్ష రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగిన అన్నీ సంఘటనలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవేనని మాజీ స్పీకర్లు సేడపట్టి ముత్తయ్య.. అవుడయప్పన్.. దురైసామిలు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం స్పీకర్ తన సీటులో ఉంటూ.. సభ్యులను సభ నుంచి బయటకు పంపాలన్న ఆదేశాల్ని ఇచ్చినప్పుడు మాత్రమే సభలోకి మార్షల్స్ రావలే తప్పించి.. స్పీకర్ సభలో లేనప్పుడు.. ఆయన తన ఛాంబర్ లో ఉన్నప్పుడు.. ఎవరి ఆదేశాలు లేకుండానే మార్షల్స్ రావటం సరికాదంటున్నారు.

సభలో తనకు మాత్రమే సర్వాధికారాలు ఉన్నాయని స్పీకర్ ధన్ పాల్ ప్రకటించుకోవటం కూడా నిబంధనలకు విరుద్ధమేనని.. అందరు సభ్యులు కలిసి మాత్రమే ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారన్న విషయాన్ని స్పీకర్ మర్చిపోయినట్లుగా కనిపిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. సభలో ప్రజాప్రతినిధుల ప్రతిపాదనల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం ప్రకటించాల్సి ఉందని.. రహస్య ఓటింగ్ జరపాలన్న డీఎంకే డిమాండ్ ను అప్పటికప్పుడు త్రోసిపుచ్చటం కూడా అన్యాయంగా చెబుతున్నారు.

అసెంబ్లీలో రహస్య ఓటింగ్ అన్నది మామూలేనని.. ఆ విధానాన్ని అనుసరించిన రాష్ట్రాలు ఉన్నాయని.. కానీ.. విపక్షాల వాదనను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా స్పీకర్ నిర్ణయాలు తీసుకున్నారన్నట్లుగా జరిగిన పరిణామాలు ఉన్నాయని మాజీ స్పీకర్లు వ్యాఖ్యానిస్తున్నారు. స్పీకర్లుగా పని చేసిన మాజీల మాటలు ఇలా ఉన్నవేళ.. డీఎంకే దాఖలు చేసిన పిటీషన్ విషయంలో మద్రాస్ హైకోర్టు నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారనుంది.  ఒకవేళ డీఎంకే వాదనను కోర్టు ఏకీభవించిన పక్షంలో సంచలన రాజకీయాలు మళ్లీ తెర మీదకు రావటం ఖాయమన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News