ఏపీని కుదిపేస్తున్న 'స‌ల‌హాదారులు' ...!

Update: 2023-01-20 09:30 GMT
ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంలో లెక్క‌కు మించి జ‌రుగుతున్న స‌ల‌హాదారుల నియామ‌కం.. ప్ర‌భుత్వాన్ని ఒక ఊపు ఊపేస్తోంది. హైకోర్టు నుంచి తీవ్ర స్థాయిలో వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి 36 మంది స‌ల‌హాదారులు ఉన్నారు. నిజానికి ఇది కేబినెట్ లో మంత్రుల సంఖ్య క‌న్నా ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ విష‌యం పొలిటిక‌ల్‌గా కూడా ప్ర‌భుత్వానికి ఇర‌కాటంగా మారింది.

ఇదే విష‌యంపై ఇప్ప‌టికి హైకోర్టులో ప‌లు కేసులు ప‌డ్డాయి. ఆయా సంద‌ర్భాల్లో హైకోర్టు అనేక వ్యాఖ్య‌లు చేసింది. ఇలానే వ‌దిలేస్తే.. స‌ల‌హాదారులే రాష్ట్రాన్ని ఏల‌తారా?  అని ఒక‌సారి.. త‌హ‌సీల్దార్‌ల‌కు కూడా స‌ల‌హాదారుల‌ను నియ‌మిస్తారేమో! అని మ‌రోసారి.

స‌ల‌హాదారుల లెక్క తేలుస్తాం.. ఇంకోసారి ఇలా.. త‌ర‌చుగా తీవ్ర వ్యాఖ్య‌లే చేస్తోంది. అదేస‌మ‌యంలో వారికి అందుతున్న అల‌వెన్సులు.. గౌర‌వ వేతనం వంటివాటిపైనా లెక్క‌లు తీసింది.

అయిన‌ప్ప‌టికీ ఏపీ ప్ర‌భుత్వం మాత్రం స‌ల‌హాదారుల నియామ‌కంలో వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఇటీవ‌ల న‌టుడు అలీ స‌హా మ‌రొక‌రిని స‌ల‌హాదారులుగా నియ‌మించింది. ఇక, దేవదాయ శాఖ సలహాదారు శ్రీకాంత్, ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ నియామకంపై ఇప్ప‌టికే కోర్టులో కేసులు న‌డుస్తున్నాయి. ఎంపీ ర‌ఘురామ దాఖ‌లు చేసిన స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డిపై పిటిష‌న్ కూడా పెండింగులోనే ఉంది.

అయితే.. తాజా విచారణలో వాదనలు వినిపించిన ప్ర‌భుత్వం త‌ర‌ఫు అడ్వకేట్ జనరల్ నిష్ణాతులైన వారినే సలహాదారులుగా నియమిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తుది నిర్ణయానికి ముందు సలహాదారుల అభిప్రాయం తీసుకుంటుందని కోర్టుకు తెలిపారు.

అయితే.. ఈ సంద‌ర్భంగా కూడా హైకోర్టు తీవ్ర వ్యాఖ్య‌లే చేసింది. ఉద్యోగుల టీఏ, డీఏల కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా అని ప్రశ్నించింది. అంతేకాకుండా సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమని వ్యాఖ్యనించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News