గూగుల్ డూడుల్‌.. స‌ర‌ళ‌.. ఆమె గురించి తెలుసా?

Update: 2021-08-08 16:02 GMT
ఈరోజు(ఆదివారం) గూగుల్ సెర్చ్ ఇంజ‌న్ డూడుల్ ను గ‌మ‌నించారా? ఒక మ‌హిళ విమానం న‌డుపుతున్న క్యారికేచ‌ర్ క‌నిపిస్తోంది క‌దూ! అయితే.. దీని ప్ర‌త్యేక‌త అంతా ఇంతా కాదు. ఈ విమానం న‌డుపుతున్న మ‌హిళ‌..మ‌న భారతీయురాలే. అంతేకాదు.. స‌హ‌జంగా.. బైక్ న‌డిపే మ‌హిళ‌ల‌ను గ‌మ‌నిస్తే.. 99 శాతం మంది జీన్స్ లేదా.. పంజాబీ డ్రెస్ లో క‌నిపిస్తారు. ఇలా అయితేనే త‌మ‌కు సౌక‌ర్యం ఉంటుంద‌ని చెబుతారు. కానీ, పైలెట్ స‌ర‌ళ మాత్రం.. భార‌తీయ‌ సంప్ర‌దాయ చీర క‌ట్టుతో ఆకాశంలో రివ్వున దూసుకుపోయారు. అదికూడా.. స్వ‌తంత్రానికి పూర్వ‌మే కావ‌డం గ‌మ‌నార్హం. అందుకే ఆ విల‌క్ష‌ణ మ‌హిళ‌కు గూగుల్ `డూడుల్` రూపంలో ప‌ట్టం క‌ట్టింది.

ఇదో గొప్ప గౌర‌వం

సరళ తక్రల్‌.. భారత తొలి మహిళా పైలెట్‌. ఎయిర్‌క్రాఫ్ట్‌ను.. అదీ సంప్రదాయ చీరకట్టులో నడిపిన మొదటి మహిళా పైలెట్‌. ఈ రోజు (ఆగష్టు 8న) ఆమె 107 జయంతి. అందుకే గూగుల్‌ ఆమెను `డూడుల్‌`తో మ‌న‌కు గుర్తు చేసింది. ఆమె ప‌ట్ల‌ గౌరవార్థం 107వ జయంతి సందర్భంగా డూడుల్‌ను ఉంచినట్లు గూగుల్‌ ప్రకటించింది. 'వైమానిక రంగంలో మహిళల ప్రవేశానికి స్ఫూర్తినిస్తూ చరిత్రలో ఆమె ఒక చెరగని ముద్ర వేశారు. అందుకే ఆమె కోసం రెండోసారి డూడుల్‌ని సృష్టించాం' అని ప్రకటించింది. ఎయిర్‌క్రాఫ్ట్‌లో చీరకట్టులో ఉన్న ఈ డూడుల్‌ను  వ్రిందా జవేరీ రూపకల్పన చేశారు.

రెండుసార్లు రిపీట్.. గూగుల్ అసాధార‌ణ చ‌ర్య‌
సాధారణంగా గూగుల్‌ డూడుల్‌ రెండుసార్లు రిపీట్‌ అయిన సందర్భాలు లేవు. నిజానికి కిందటి ఏడాదే సరళ పేరు మీద డూడుల్‌ రిలీజ్‌ కావాల్సి ఉంది. ఆ టైంలో కేరళలో విమాన ప్రమాదం జరిగింది. అందుకే ఆ టైంలో సహాయక చర్యలకు గుర్తుగా డూడుల్‌ను నిలిపివేశారు. అయితే.. తాజాగా మ‌రోసారి స‌ర‌ళ‌ను డూడుల్‌గా ప్రొజెక్టు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఎవ‌రీ స‌ర‌ళ‌.. ఏమా క‌థ‌!
సరళ.. 1914లో పుట్టారు. 16 ఏళ్ల వయసులో ఆమెకి పెళ్లైంది. ఆమె భర్త పైలెట్‌. ఆయన స్ఫూర్తితోనే పైలెట్‌ అవ్వాలనుకుంది. నాలుగేళ్ల పాప ఉండగానే.. 21 ఏళ్ల వయసులో చీర కట్టులో విమానం నడిపి ఏ గ్రేడ్‌ లైసెన్స్‌ దక్కించుకుంది. లాహోర్‌ ఫ్లైయింగ్‌ క్లబ్‌ తరపున ఈ ఘనత సాధించాక.. కమర్షియల్‌ పైలెట్‌ శిక్షణ కోసం జోధ్‌పూర్‌ వెళ్లింది. అయితే 1939లో ఆమె భర్త చనిపోవడం, రెండో ప్రపంచ యుద్ధం రావడంతో కమర్షియల్‌ పైలెట్‌ కావాలనే కల చెదిరింది. ఆపై లాహోర్‌కు వెళ్లి ఫైన్‌ ఆర్ట్స్‌, పెయింటింగ్‌ కోర్సులు చేసింది. విభజన తర్వాత ఢిల్లీకి వచ్చి ఆర్‌పీ తక్రల్‌ను వివాహం చేసుకుంది. ఆపై ఆభరణాల డిజైనింగ్‌, బట్టల డిజైనింగ్‌ వ్యాపారంతో ఎంట్రప్రెన్యూర్‌గా పెద్ద సక్సెస్‌ అయ్యింది. 2008లో సరళ తక్రల్‌ అనారోగ్యంతో కన్నుమూశారు.
Tags:    

Similar News