చెన్నైలో చచ్చిన 45 నిమిషాల తర్వాత బతికాడు

Update: 2016-04-19 16:38 GMT
వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజంగా జరిగిన ఘటన. ఈ ఉదంతంపై వైద్యులు సైతం విస్మయానికి గురి అవుతున్నారు. ఒక గుండె దాదాపు 45 నిమిషాల సేపు పని చేయటం ఆగిపోయి.. ఆ తర్వాత మళ్లీ కొట్టుకోవటం సాధ్యమేనా? ఎవరిని అడిగినా సాధ్యం కాదంటారు. కానీ.. చెన్నైలోని ఒక ఆసుపత్రిలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకోవటం అద్భుతంగా మారింది. గుజరాత్ కు చెందిన జయసుఖ్ భాయ్ అనే 38 ఏళ్ల వ్యక్తి కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. ఉన్నట్లుండి గుండె పని చేయటం ఆగిపోయే స్థితికి సదరు వ్యక్తి చేరుకున్నాడు.

అతన్ని రక్షించుకునేందుకు గుజరాత్ నుంచి హుటాహుటిన చెన్నైలోని ఫోర్టిస్ మలర్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఆసుపత్రిలో చేర్చి.. గుండె మార్పిడి ఆపరేషన్ కు ఏర్పాట్లు చేస్తుండగా ఉన్నట్లుండి జయసుఖ్ భాయ్ గుండె పని చేయటం ఆగిపోయింది. అతని గుండె పని చేసేందుకు వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో వైద్యులు నిరాశకు గురయ్యారు. ఇలాంటి సమయంలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. దాదాపు 45 నిమిషాల సేపు పని చేయటం ఆగిపోయిన గుండె ఉన్నట్లుండి కొట్టుకోవటం షురూ అయ్యింది.

ఇలా జరగటంపై వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అతని గుండె పది రోజులు పని చేసే అవకాశం ఉందనుకుంటున్న సమయంలోనే అనుకోని వరంలా హైదరాబాద్ లో ఒక గుండె మార్పిడికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. దాన్ని ప్రత్యేకంగా చెన్నైకి తరలించి ఆపరేషన్  నిర్వహించారు. జనవరి 29న విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసిన వైద్యులు.. తాజాగా జయసుఖ్ భాయ్ తో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఉదంతం గురించి వైద్యులు మీడియాతో చెప్పినప్పుడు.. నిజంగా ఇలాంటివి సాధ్యమేనా అనిపించినా.. కళ్ల ముందు కనిపించే జయసుఖ్ భాయ్ ను చూసినప్పుడు నమ్మాల్సిందే.
Tags:    

Similar News