‘పార్టీ’ తో హిల్లరీకి ట్రంప్ దెబ్బేయనున్నారా?

Update: 2016-11-04 04:23 GMT
ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని తుత్తరగాళ్ల తీరును మన పెద్దోళ్లు ఎప్పుడో చెప్పేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీరు చూస్తే ఇదే అంశం గుర్తుకు రాక మానదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిన్న మొన్నటి వరకూ డెమొక్రాట్ల అభ్య‌ర్థి హిల్లరీకి భారీ అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్న వేళ.. గడిచిన మూడు నాలుగు రోజులుగా ఈ ఇద్దరి మధ్య పోటీ సమం అయిందని కొందరు.. కాదు.. హిల్లరీని ట్రంప్ క్రాస్ చేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

అయితే.. ఇందులో వాస్తవం మాట ఎలా ఉన్నా.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల ట్రంప్ శిబిరింలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ఈ నెల 8న పూర్తి కానుంది. అదే రోజు రాత్రి సక్సెస్ పార్టీ అన్న చందంగా భారీ పార్టీని మాన్ హటన్ లోని ఓ విలాసవంతమైన హోటల్ లో ఇవ్వనున్నట్లుగా ట్రంప్‌ తాజాగా ప్రకటించారు.

ట్రంప్ వర్గీయులు దీన్ని సక్సెస్ పార్టీగా అభివర్ణిస్తున్నా.. అధికారికంగా మాత్రం అలాంటిదేమీ ప్రకటించలేదు. దీన్ని సక్సెస్ పార్టీగా కాకుండా తన మద్దతుదార్లకు సందేశాన్ని ఇచ్చేదిగా అభివర్ణిస్తున్నారు. ఏమైనా.. ఫలితాల విడుదలకు ముందే పార్టీ ఏర్పాటు చేయటంపై పలువురు విమర్శిస్తుంటే.. తనకు అంతా సానుకూలంగా ఉందన్న అభిప్రాయాన్ని కల్పించే వ్యూహంలో భాగంగానే ట్రంప్ తాజా పార్టీ ఉదంతాన్ని తెర మీదకు తెచ్చారని చెబుతున్నారు.

ఏ ఎన్నికల్లో అయినా.. ఏ వర్గానికి సంబందం లేని తటస్థ ఓటర్లు కొందరు ఉంటారు. వారిలో కొందరు గెలుపు గుర్రాలకు మాత్రమే ఓటు వేయాలని భావిస్తుంటారు. అలాంటి వారి దృష్టిని ఆకర్షించేందుకు వీలుగా.. ‘‘ఆల్ ఈజ్ వెల్’’ అంటూ తామే విజయం సాధిస్తామన్న ప్రచారానికి బలం చేకూరేలా చేయటం కోసం పోలింగ్ నిర్వహించిన రోజు సాయంత్రమే భారీ పార్టీ అంటూ ట్రంప్ వర్గీయులు ప్రకటించటం వెనుక వ్యూహం ఉందని చెబుతున్నారు. చూస్తుంటే ట్రంప్ సామాన్యుడు కాదు సుమి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News