హాట్ టాపిక్ గా మారిన అమెరికా నేతల మాటలు

Update: 2015-12-09 05:56 GMT
ఆ దేశం.. ఈ దేశం అన్న తేడా లేకుండా ప్రపంచ దేశాల్లోని ప్రజల్ని ఆహ్వానించే దేశంగా అమెరికాకు పేరుంది. అలాంటి దేశంలో.. ఒక వర్గం ప్రజలకు నో చెప్పేయాలన్న మాటే కాదు.. అదో చర్చగా మారటం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఐఎస్ తీవ్రవాదం ప్రపంచ దేశాలకు ముప్పు కలిగించటమే కాదు.. వణికిస్తోంది కూడా.

అమెరికాలో ఒక జంట (అమెరికన్ ముస్లింలు) విచక్షణా రహితంగా కాల్పులు జరపటం.. వారికి ఐఎస్ తో సంబంధాలు ఉన్నాయని తేలిన సంగతి తెలిసిందే.  ఇవే కాక.. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలతో ముస్లింల పట్ల ద్వేషం అమెరికా సమాజంలో పెరుగుతోంది. దీనికి తగ్గట్లే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

అమెరికాలోకి ముస్లింలను ప్రవేశించకుండా నిషేధం విధించాలన్నది ట్రంప్ మాట. ప్రస్తుతం దేశంలో ఏం జరుగుతుందో అధికారులు కనిపెట్టే వరకూ ముస్లింలను దేశంలోకి ప్రవేశించకుండా పూర్తిగా అడ్డుకోవాలంటూ ట్రంప్ కోరటంపై అమెరికా అధ్యక్షుడితో సహా,, రాజకీయ పార్టీలు తీవ్రంగా విరుచుకపడుతున్నాయి. ఐఎస్ పై యుద్ధం ప్రకటించి.. అది ఇస్లాంకు వ్యతిరేకం కాదంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ఒబామా ప్రకటించిన పక్కరోజే.. ట్రంప్ స్పందిస్తూ.. ముస్లింలను అమెరికాలోకి అడుగు పెట్టనీయకూడదంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. వివాదాస్పదమయ్యాయి.

అమెరికా లాంటి ఉదార దేశంలో.. ఒక వర్గంపై ఇంత పెద్ద వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు పలు దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉగ్రవాదుల్ని ముస్లిం వర్గ ప్రతినిధులుగా చూసే కన్నా.. ఉగ్రవాదుల్ని గుర్తించే విషయంలో మరింత పక్కాగా ఏర్పాట్లు చేసుకోవటం మంచిది.అమెరికా లాంటి అగ్రరాజ్యానికి చెందిన నేతలే.. ముస్లిం వర్గాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News