వైసీపీలో జాయినింగ్ మీద తేల్చేసిన శైలజానాథ్!

ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకె శైలజానాధ్ వైసీపీలో జాయినింగ్ మీద తేల్చేశారు.

Update: 2024-12-23 03:49 GMT

ఏపీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. వైసీపీలో చేరేందుకు కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపుతున్నారా అంటే వెయిట్ అండ్ సీ అనాల్సిందే. ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకె శైలజానాధ్ వైసీపీలో జాయినింగ్ మీద తేల్చేశారు.

వైసీపీలో తాను చేరేది అన్నది అయితే ఈ రోజుకు లేదని రేపు ఏమవుతుందో తెలియదు అన్నట్లుగా మాట్లాడారు. అంతే కాదు జగన్ పట్ల ఆ ఇంటర్వ్యూలో సాఫ్ట్ కార్నర్ తో మాట్లాడారు. జగన్ లీడ్ చేస్తున్న వైసీపీలో ఉన్న వారు అంతా కాంగ్రెస్ వారే అని అన్నారు.

ఇక తాను కర్నూలులో ఒక పెళ్ళిలో జగన్ ని కలసిన మాట వాస్తవం అని అది మర్యాదపూర్వకంగా కలయిక అన్నారు. ఇక జగన్ తో తనకు చిరకాల పరిచయం ఉందని ఆయన ఎదురుపడితే తనను హగ్ చేసుకుంటారని తాను షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడుతానని శైలజానాధ్ అన్నారు.

ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఉందని దానికి వ్యతిరేక శక్తులు పోలరైజ్ కావాల్సిన అవసరం ఉందని శైలజానాథ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీగా పెద్దగా ఫోకస్ కాకపోవచ్చు కానీ ఆ భావజాలం అయితే ఉందని శైలజనాధ్ అన్నారు. వైసీపీలోనూ కాంగ్రెస్ ఉందని ఆయన అంటున్నారు.

ఇక ఏపీలో కూడా రెండు భావజాలల మధ్య పోరాటం జరుగుతోందని జాతీయ స్థాయిలో ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమి మాదిరిగానే ఏపీలో కూడా ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా లౌకిక శక్తులు అన్నీ ఏకమవుతాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు మాత్రమే అయిందని అందువల్ల రానున్న రోజులలో ఈ పునరేకీకరణ ఏ రూపం తీసుకుంటుంది అన్నది చూడాలని అన్నారు.

ఇవన్నీ చెప్పిన ఆయన తాను మాత్రం వైసీపీలో ఎపుడు చేరుతున్నది చెప్పలేదు. తాను అన్నీ ఆలోచించుకోగలను అని మాత్రమే అన్నారు. తాను ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వాడిని అన్నారు. తనకు పదవుల మీద ఆశ లేదని కాంగ్రెస్ ఫిలాసఫీ తనకు ఇష్టమని అన్నారు. రాహుల్ గాంధీకి తాను పెద్ద ఫేవరేట్ అని చెప్పారు.

ఏపీలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరింతగా ఎన్డీయే ప్రభుత్వం మీద పోరాడాల్సి ఉందని అన్నారు. కాంగ్రెస్ విధానాలను జనంలోకి తీసుకుని వెళ్ళాలని కూడా కోరుతున్నారు. అంతే కాదు ఏపీలో ఎన్డీయే వ్యతిరేక శక్తులను ఏకం చేయడంలో కాంగ్రెస్ తగిన పాత్ర పోషించాలని ఆయన అన్నారు.

దేశంలో ఈవీఎంల మీద సందేహాలు అయితే ఉన్నాయని వాటి విషయంలో తీరులో ఈ డౌట్లను తీర్చాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అదే విధంగా లౌకిక వాదానికి ఇబ్బందులు ఎదురవుతున్న వేళ ప్రగతి శీల ప్రజాస్వామ్య శక్తులు అంతా ఒక్కటి కావాలని అన్నారు.

ఏపీలో 11 సీట్లు వచ్చినంతమాత్రన వైసీపీని తక్కువ అంచనా వేయలేమని నలభై శాతం ఓటు బ్యాంక్ అంటే చిన్న విషయం కాదని అన్నారు. 23 సీట్లు వచ్చిన టీడీపీ ఈ రోజు అధికారంలోకి వచ్చింది కదా అని ఆయన గుర్తు చేశారు. మరో అయిదారు శాతం ఓట్లు అటు నుంచి ఇటు మళ్ళితే అధికారం మారుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News