ట్రంప్ ఖాతాలో 20 ఏళ్ల రికార్డ్‌ బ్రేక్

Update: 2017-06-26 10:18 GMT
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుకు ఇది మ‌రో నిద‌ర్శ‌నం. ర‌ంజాన్ సంద‌ర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చే సాంప్ర‌దాయాన్ని ఈసారి వైట్‌ హౌజ్ ప‌క్క‌న‌పెట్టేసింది. గ‌త రెండు ద‌శాబ్దాల‌లో వైట్‌ హౌజ్ ఇలా చేయ‌డం ఇదే తొలిసారి. కేవ‌లం ఒక ప్ర‌క‌ట‌న‌తో డొనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వం స‌రిపెట్టింది. 1805లో అప్ప‌టి అధ్య‌క్షుడు థామ‌స్ జెఫ‌ర్‌ స‌న్ రంజాన్‌ కు ముందు వైట్‌ హౌజ్‌ లో తొలిసారి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఆ త‌ర్వాత 1996లో అప్ప‌టి ఫ‌స్ట్ లేడీ హిల్ల‌రీ క్లింట‌న్ ఈ సాంప్ర‌దాయాన్ని తిరిగి ప్రారంభించారు. 1999 నుంచి ప్ర‌తి ఏటా వైట్‌ హౌజ్‌ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు. 2001లో వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌ పై దాడి త‌ర్వాత కూడా అప్ప‌టి అధ్య‌క్షుడు జార్జ్ బుష్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఆ త‌ర్వాత ఒబామా కూడా 2009 నుంచి ప్ర‌తి ఏటా ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల సంద‌ర్భంగా అధ్య‌క్ష పీఠం కోసం ప్ర‌చారం చేస్తున్న‌ప్ప‌టి నుంచి ఇస్లాంపై కాస్త వ్య‌తిరేకంగానే ఉన్న డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇఫ్తార్ విందు సాంప్ర‌దాయానికి తెర‌దించారు. కేవ‌లం ప్ర‌క‌ట‌న జారీ చేసి చేతులు దులుపుకున్నారు. అది కూడా అధ్య‌క్షుడి అధికార సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో పోస్ట్ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అమెరికాతోపాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ముస్లింలంద‌రూ ఈద్ జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా వాళ్ల విలువ‌ల‌ను గౌర‌వించ‌డానికి అమెరికా క‌ట్టుబ‌డి ఉంద‌ని మ‌రోసారి ప్ర‌క‌టిస్తున్నాం.. ఈద్ ముబార‌క్ అని వైట్‌ హౌజ్ ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. అటు విదేశాంగ మంత్రి రెక్స్ టిల్ల‌ర్‌ స‌న్ కూడా స్టేట్ డిపార్ట్‌ మెంట్‌ లో ఇఫ్తార్ ఇవ్వ‌లేదు. కాగా, ట్రంప్ చ‌ర్య ముస్లింల మ‌నో భావాలు దెబ్బ‌తీసే విధంగానే ఉంద‌ని అమెరికాలోని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News