ట్రంప్ పాయింట్ల‌తో మ‌నోళ్ల‌కు బంప‌ర్ ఛాన్స్‌

Update: 2017-08-04 04:30 GMT
అమెరికాలో శాశ్విత పౌర‌స‌త్వం కోసం గ్రీన్ కార్డులు జారీ చేయ‌టం తెలిసిందే. అయితే.. ఈ ఎంపిక‌కు లాట‌రీ విధానాన్ని అనుస‌రిస్తుంటారు. అయితే.. ఆ విధానానికి చెక్ చెప్పి.. శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో పాయింట్ల ఆధారంగా.. ప్ర‌తిభ‌ను గుర్తించి మ‌రీ గ్రీన్ కార్డులు ఇవ్వాల‌న్న నిర్ణ‌యానికి ట్రంప్ స‌ర్కారు రావ‌టం తెలిసిందే. ఇందులో భాగంగా రైజ్ బిల్లును తెర‌పైకి తీసుకొచ్చారు.

రిఫార్మింగ్‌ అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ ఫర్‌ స్ట్రాంగ్‌ ఎంప్లాయ్‌ మెంట్ పేరుతో రైజ్ బిల్లును తీసుకొచ్చిన ట్రంప్ స‌ర్కారు త్వ‌ర‌లో దీన్ని చ‌ట్టంగా చేసేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది.ట్రంప్ స‌ర్కారు అనుకున్న‌ట్లు రైజ్ బిల్లు కానీ చ‌ట్టంగా మారితే భార‌తీయుల‌కు ఇది బంప‌ర్ ఛాన్స్ గా మార‌నుంద‌ని చెప్పొచ్చు. గ్రీన్ కార్డుల జారీని ఇప్పుడున్న దానికి (ఏడాదికి 10 ల‌క్ష‌లు) యాభై శాతం కోత పెట్టాల‌న్న ఉద్దేశంతో తాజా బిల్లును తెస్తున్నప్ప‌టికీ భార‌తీయుల‌కు తాజా నిర్ణ‌యం వ‌రంలా మారుతుంద‌ని చెబుతున్నారు.

ఎందుకంటే.. రైజ్ బిల్లులో పేర్కొన్న ప‌లు అంశాలు భార‌తీయుల‌కు లాభంగా మార‌తాయ‌ని చెబుతున్నారు. పాయింట్ల ఆధారంగా గ్రీన్ కార్డు జారీ విధానం రైజ్ బిల్లులో కీల‌కాంశంగా చెప్పాలి.  గ్రీన్ కార్డు అర్హ‌త‌కు అవ‌స‌ర‌మైన 30 పాయింట్ల‌ను మ‌నోళ్లు ఈజీగా సాధిస్తార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. భార‌తీయుల్లో అత్య‌ధికులు అమెరికా వ‌ర్సిటీల్లో పీజీ పూర్తి చేసిన వారే ఉంటారు.

దీంతో.. విద్యాప‌రంగా వీరికి ఎనిమిది పాయింట్లు ల‌భిస్తాయి. గ్రీన్ కార్డు ద‌ర‌ఖాస్తు చేసుకునే స‌మ‌యానికి మ‌నోళ్ల వ‌య‌సు పాతిక వ‌ర‌కు ఉంటుంది. లేదంటే.. 26 నుంచి 30 ఏళ్ల కేట‌గిరిలో ఉంటారు. దీంతో.. ప‌ది పాయింట్లు ఈజీగా సంపాదించే చాన్స్ ఉంటుంది. ఆదాయం ప‌రంగానూ.. ఆంగ్ల భాష‌లో ప్రావీణ్య‌ప‌రంగా చూసినా మ‌నోళ్ల‌కు మంచి మార్కులే ప‌డ‌తాయి. దీంతో.. గ్రీన్ కార్డును సాధించ‌టానికి అవ‌స‌ర‌మైన అర్హ‌త‌లు అమెరికాలోని భార‌తీయుల్లోనే ఎక్కువ మంది ఉంటార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయితే.. గ్రీన్ కార్డుల జారీ విష‌యంలో ప్ర‌తి దేశానికి.. ప్ర‌తి ఏటా ఇంత శాతానికి మించ‌కూడ‌ద‌న్న రూల్ ఉంది. ఇప్పుడున్న రూల్ ప్ర‌కారం అయితే గ‌రిష్ఠంగా రెండు శాతం డిపెండెంట్ గ్రీన్ కార్డులు.. గ‌రిష్ఠంగా 7 వాతం ఉద్యోగ‌స్తుల‌కు గ్రీన్ కార్డులు భార‌త్‌ కు ల‌భిస్తున్నాయి. మ‌రి.. తాజా బిల్లులో గ్రీన్ కార్డు జారీకి దేశాల వారీగా ప‌రిమితులు ఏమైనా పెడ‌తారా? అన్న దానిపై క్లారిటీ లేదు. ఒక‌వేళ‌.. పాయింట్ల  ఆధారంగా మాత్ర‌మే కానీ ఏ దేశానికి చెందిన వార‌న్న విష‌యం తాము ప‌ట్టించుకోమ‌ని కానీ ట్రంప్ స‌ర్కారు భావిస్తే.. భార‌తీయ టెకీల‌కు ఇదో బంప‌ర్ ఛాన్స్ గా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు.
Tags:    

Similar News