భారతదేశంలోనే ఇలాంటి సీన్: శ్రీవారికి రూ.కోటి విరాళం ఇచ్చిన ముస్లిం ఫ్యామిలీల

Update: 2022-09-21 09:39 GMT
పరమత సహనం మన దేశంలో ఉన్నంత గొప్పగా మరే దేశంలో కనిపించదు. నిజానికి పరమత సహనానికి పరీక్ష పెట్టేది రాజకీయ అంశాలే తప్పించి.. సామాజిక అంశాలు ఏ మాత్రం కాదు. మతానికి సంబంధించిన రచ్చ దేశంలో ఎక్కడ చోటు చేసుకున్నా.. అదంతా కూడా రాజకీయ అంశాలతోనే తప్పించి.. మరింకేమీ కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. హిందువు అయినా ముస్లిం అయినా.. క్రిస్టియన్ అయినా.. మన దేశంలో ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే విధానం.. ఒకరి కల్చర్ ను మరొకరు హ్యాపీగా యాక్సెప్ట్ చేసే వైనం చాలా ఎక్కువ.

ఆ మాటకు వస్తే చాలామంది హిందువులు చర్చిలకు వెళ్లటం తెలిసిందే. అంతేనా.. ఎంతో మంది దర్గాలకు వెళ్లి తమ మొక్కుల్ని తీర్చుకునే హిందువులు బోలెడంత మంది కనిపిస్తుంటారు.

అలాంటి ఈ దేశంలో ఒకరి మతాన్ని మరొకరు అభిమానించటమే కాదు.. ఆరాధిస్తుంటారు. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రాజకీయ కారణాల పుణ్యమా అని.. కొన్ని ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు.. నిజంగానే ఇవన్నీ జరిగాయా? అన్న సందేహం కలుగక మానదు.

తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి తిరుమలలో చోటు చేసుకుంది. చెన్నైకు చెందిన సుబీనా బాను.. అబ్దుల్ ఘనీ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి రావటమే కాదు రూ.1.02 కోట్ల భారీ విరాళానని టీటీడీకి అందించిన వైనం సర్ ప్రైజింగ్ గానే కాదు పలువురి నోట ప్రశంసలు పొందేలా మారింది. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో దాతలు ఇచ్చిన విరాళం చెక్కును టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందించారు.

తామిచ్చిన కోటి విరాళంలో రూ.15 లక్షలు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు.. మరో రూ.87 లక్షలు తిరుమలలో ఇటీవల ఆధునీకరించిన శ్రీపద్మావతి విశ్రాంతి భవనంలో నూతన ఫర్నీచర్.. వంటపాత్ర కోసం ఇచ్చారు.

తిరుమల శ్రీవారిపై తమకున్న అభిమానాన్ని భారీ విరాళంతో చాటుకున్న ఈ ముస్లిం దంపతుల్ని పలువురు అభినందిస్తున్నారు. అంతేకాదు.. ఇదే కదా భారత్ అంటే.. అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News