అచ్చెన్న కంటే ఆయనే స్పీడ్ మరి... ?

Update: 2021-11-16 00:30 GMT
తెలుగుదేశాన్ని జాతీయ పార్టీ అంటారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిష్టర్ అయింది మాత్రం పక్కా ప్రాంతీయ పార్టీగానే. జాతీయ పార్టీ హోదా సంపాదించాలి అంటే బహు కష్టం. కానీ ఎవరైనా తమది జాతీయ పార్టీ అని ఎంత చెప్పుకున్నా అది అనఫీషియల్ గానే ఉంటుంది. టీడీపీ తీరు కూడా అంటే. మరి జాతీయ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు ఉంటే జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఉన్నారు.

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా అచ్చెన్నాయుడిని నియమించారు. కానీ నిజానికి ఆయన పరిస్థితి చూస్తే జిల్లా ప్రెసిడెంట్ కి ఎక్కువ అన్నట్లుగానే ఉందని కామెంట్స్ పడుతున్నాయి. ఏపీలో ఏ చిన్న ఘటన జరిగినా చినబాబు ఉరుకులు పరుగుల మీద పరామర్శకు వస్తారు. ఆఖరుకు విశాఖలో సైతం పార్టీ కార్యక్రమాలకు లోకేషే రావాలి.

మరి అచ్చెన్నాయుడు ఏం చేస్తారు అంటే ఆయన బాస్ చంద్రబాబు ఏం చేయమంటే అదే చేయడం. అచ్చెన్నాయుడు విషయంలో చంద్రబాబు పట్టుబట్టి ప్రెసిడెంట్ చేశారు కానీ లోకేష్ కి ఎక్కడా అడ్డు రాకుండా ఆయన్ని అలా తగ్గిస్తూనే ఉన్నారని పార్టీలో మాటగా ఉంది.

బీసీకి పదవి ఇచ్చామని చెప్పుకోవడానికి తప్పిస్తే అచ్చెన్నాయుడుకు పార్టీలో పవర్స్ ఏమీ లేవు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక లోకేష్ ని ఎలివేట్ చేస్తూ సీనియర్ మోస్ట్ నేత అయిన అచ్చెన్నాయుడుని పక్కన పెట్టడం పట్ల ఆయన వర్గం గుర్రు మీద ఉంది.

ఏపీలో మినీ లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతూంటే అచ్చెన్నాయుడు లాంటి లీడర్లు అన్ని చోట్లా తిరిగి హల్ చల్ చేయాలి. కానీ ఆయన్ని నెల్లూరు కార్పొరేషన్ కి మాత్రమే పరిమితం చేశారు. అక్కడ టీడీపీ గెలుపు డౌట్. కానీ ఆయనకు బాధ్యతలు అప్పగించడం ద్వారా రేపటి రోజున బాధ్యుడిని చేయడానికే ఈ ఫిటింగ్ పెట్టారా అన్న డౌట్లు అయితే అనుచరుల్లో ఉన్నాయట.

ఇంకో వైపు చూస్తే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల దాకా అచ్చెన్న హవా కొంత నడిచింది. అప్పట్లో ఆయన ఒక హొటల్ లో పార్టీ లేదూ, మరేమీ లేదూ అంటూ చేశారంటున్న వివాదాస్పద కామెంట్స్ వల్లనే చంద్రబాబు సైడ్ చేశారన్న విమర్శలు ఉన్నాయి. అచ్చెన్న సైతం నాలిక్కరచుకున్నా ఉపయోగం లేకపోతోంది.

దాంతో ఆయన కూడా దూకుడు తగ్గించేశారు అంటున్నారు. ఇక లోకేష్ మాత్రమే తన తరువాత వారసుడు అని బాబు గట్టిగా చెప్పడానికే చూస్తున్నారు. అదే టైమ్ లో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కూడా ఆయనే అన్న సంకేతాలూ ఇస్తున్నారు. మరి అచ్చెన్న ఏంటి అంటే పేరుకు మాత్రమే అంటున్నారు.

లేకపోతే ఏపీలోని పదమూడు జిల్లాలూ తిరగాల్సిన ప్రెసిడెంట్ ఇక జిల్లాలో ఉంటే లోకేష్ మాత్రం నలు చెరగులూ తిరుగుతూ ఫోకస్ అవడమేంటి అన్నది కూడా అచ్చెన్న వర్గానికి పట్టుకున్న బాధగా ఉంది. అయినా చంద్రబాబు, చినబాబులదే పార్టీ. ఆ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరు, చెప్పలేరు. ఒకవేళ గట్టిగా నోరు చేసినా ఫలితాలూ పర్యవసానాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.

ఈ నేపధ్యంలోనే అచ్చెన్నకు అవమానాలు జరుగుతున్నా అలా అదిమిపట్టుకుని ఉండడమే అంటున్నారు. మొత్తానికి పార్టీ అధికారంలోకి వస్తే తాను హోం మంత్రిని అవుతానని ఆ మధ్య గట్టిగా గర్జించిన అచ్చెన్నాయుడు రేపటి రోజున కనీసం మంత్రి అవుతారా అన్న సందేహాలు అయితే క్యాడర్ కి వస్తున్నాయట. అయితే ఇది వింత కాదు, రాజకీయాల్లో సర్వసాధారణమైన విషయంగానే చూడాలి.




Tags:    

Similar News