మోడీ కేర్..ఆచరణ సాధ్యమేనా?

Update: 2018-02-03 09:22 GMT
మోడీ కేర్.. 40శాతం దేశ జనాభాను ఆరోగ్యభద్రత ప‌రిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌ లో ప్రకటించిన భారీ పథకం. ప్రపంచంలో ప్రభుత్వరంగంలో చేపడుతున్న అతిపెద్ద సంక్షేమ కార్యక్రమంగా జాతీయ ఆరోగ్యభద్రతా పథకాన్ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో అభివర్ణించారు. ప్రతీ కుటుంబానికి రూ.5లక్షల ఆరోగ్యబీమా కల్పిస్తూ - 10కోట్ల కుటుంబాలకు ప్రయోజనాలిస్తుందని ప్రభుత్వం చెప్తున్నా - పథకం ఆచరణపై అనుమానాలు మాత్రం తొలుగడం లేదు. విధివిధానాలపై స్పష్టత లేకపోవడం - అవసరమైన రూ.11వేల కోట్ల నిధులు ఎలా సర్దుబాటు చేస్తారో తెలుపకపోవడమే అందుకు కారణం. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఆగమేఘాలపై పథకాన్ని ప్రకటించారే తప్ప - కనీస కసరత్తు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంచంపట్టిన దేశీయ ఆరోగ్యరంగానికి మోదీ కేర్ కాయకల్ప చికిత్స చేస్తుందా? లేక ఆచరణలో విఫలమైన మరో ఆరోగ్య కార్యక్రమంగా నిలిచిపోతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దేశంలోని పది కోట్ల పేద కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి ఏటా ఐదు లక్షల రూపాయల చొప్పున మేర జాతీయ ఆరోగ్యభద్రత పథకాన్ని (ఎన్‌ హెచ్‌ పీఎస్) ప్రవేశపెడుతున్నామని, ఇది ప్రపంచంలోనే ప్రభుత్వం నిర్వహిస్తున్న అతిపెద్ద పథకమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం నాటి తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పుకొచ్చారు. మోడీ కేర్‌ గా పిలుస్తున్న ఈ పథకంపై కేంద్రం భారీగా ఆశలు పెట్టుకుంది. అయితే రెండేళ్ల‌ క్రితం 2016 బడ్జెట్ సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీయే పేద కుటుంబాలకు ఏటా లక్ష రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకొస్తామని ప్రకటించగా, ఇప్పటివరకు అది అమలుకు నోచుకోలేదు. అది కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందడానికే ఏడాదికిపైగా సమయం పట్టింది. మోడీ కేర్ పథకానికి ఏటా రూ.11వేల కోట్లు ఖర్చవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఆరువేల నుంచి ఏడువేల కోట్లు కేంద్రం వాటాగా - మిగతా మొత్తాన్ని రాష్ర్టాలు భరించేలా రూపొందించవచ్చని భావిస్తున్నారు. అయితే ఆ నిధులు ఎక్కడినుంచి తెస్తారన్న దానిపై బడ్జెట్‌ లో ప్రస్తావన లేదు. ఈ పథకంపై కేంద్రమంత్రులు తలోరకంగా మాట్లాడుతుండటం చూస్తే - దాని విధివిధానాలపై ప్రభుత్వ పెద్దలకే స్పష్టతలేదని వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రోవైపు ఇప్పటికే ఆరడజనుకు పైగా ఆరోగ్యబీమా పథకాలను కేంద్రం అమలు చేస్తోంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్‌ ఎస్‌ బీవై) - ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీం (ఈఎస్‌ ఐఎస్) - కేంద్ర ప్రభుత్వ హెల్త్‌ స్కీం (సీజీహెచ్‌ ఎస్ -, ఆమ్ ఆద్మీ బీమా యోజన (ఏఏబీవై) - జనశ్రీ బీమా యోజన (జేబీవై) - యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం(యూహెచ్‌ ఐఎస్) ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలకు ఆరోగ్యబీమా కవరేజీ సంతృప్తికరంగా లేదని తాజాగా విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్యసర్వే (ఎన్‌ ఎఫ్‌ హెచ్‌ ఎస్-4) నివేదిక స్పష్టంచేసింది. దేశంలోని 29శాతం కుటుంబాల్లో కనీసంగా ఒక్కరు మాత్రమే ఆరోగ్యబీమా కలిగి ఉన్నారని - దేశంలోని 15-49 ఏళ్ల‌ వయసున్నవారిలో 20శాతం మహిళలు - 23శాతం పురుషులు మాత్రమే ఆరోగ్యబీమా పరిధిలోకి వస్తున్నారని సర్వే వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ హెల్త్‌ స్కీం - రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన.. సమర్థవంతమైన ఆరోగ్య పథకాలు అయినప్పటికీ, అవి ఆచరణలో విఫలమైనట్లు ఆరోగ్య సర్వే గణాంకాలు చెబుతున్నాయి.

రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన పథకానికి ఈసారి బడ్జెట్‌ లో కేటాయించిన రూ.2వేల కోట్లను మోడీకేర్‌ కు మళ్లించనున్నారు. ప్రతీ పేద కుటుంబానికి ఏటా రూ.ఐదు లక్షల వరకు ఆరోగ్యరక్షణ కల్పించాలంటే ఈ సొమ్ము సరిపోదని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం మూడుశాతం విధిస్తున్న విద్యాసెస్‌ ను విద్యా - ఆరోగ్య సెస్‌ గా మార్చి ఇప్పుడు నాలుగుశాతంగా పెంచనున్నామని, ఈ సెస్ కింద అదనంగా రూ.11వేల కోట్లు వస్తాయని ఆర్థికమంత్రి తెలిపారు. వాటిని మోదీకేర్ స్కీమ్‌ కు మళ్లించే అవకాశముందని భావిస్తున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయే ప్రభుత్వ పూర్తిస్థాయి చివరి బడ్జెట్ కావడంతో ఆగమేఘాలపై ప్రకటన అయితే చేశారు కానీ.. నిధులు - విధివిధానాలపై స్పష్టత లేదని తెలుస్తోంది.

మోడీ కేర్ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న కానీ - అక్టోబర్ 2న కానీ లాంఛనప్రాయంగా ప్రారంభించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పథకం కింద 10కోట్ల కుటుంబాలకు ప్రీమియం చెల్లింపులకు గాను ఏడాదికి సుమారు రూ.10వేల కోట్ల నుంచి రూ.12వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని నీతిఆయోగ్ సలహాదారు అలోక్‌ కుమార్ తెలిపారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలోనే పథకం అమలు ఉంటుందని చెప్పారు. సుమారు రూ.5వేల కోట్ల నుంచి రూ.6వేల కోట్ల వరకు కేంద్రంపై భారం పడుతుందని, మిగిలిన మొత్తాన్ని రాష్ర్టాలే భరించాల్సి ఉంటుందని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.
Tags:    

Similar News