వైద్యం చేసిన లండన్ డాక్టర్ వెళ్లిపోయారు

Update: 2016-10-04 05:27 GMT
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఒక క్లారిటీ ఇప్పటికీ రాకున్నా.. ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అమ్మకు వైద్యం చేసేందుకు లండన్ నుంచి వచ్చిన ప్రముఖ వైద్యులు రిచర్డ్ బెలే తిరిగి తన దేశానికి వెళ్లిపోయారు. అమ్మ కండీషన్ క్రిటికల్ గా ఉందన్న నేపథ్యంలో రిచర్డ్ ఎంట్రీ ఇవ్వటం..అమ్మకు వైద్యం చేయటం తెలిసిందే. సోమవారం ఉదయం కాసేపు వెంటిలేటర్స్ ను తీసేశారని.. అమ్మ స్పృహలోకి రావటంతోపాటు.. కళ్లు తెరిచారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

గతంలో తీవ్రస్థాయికి చేరుకున్న షుగర్ లెవెల్స్.. గడిచిన కొద్దిరోజులుగా వైద్యులు చేస్తున్న ప్రయత్నాలతో కంట్రోల్ లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. అమ్మ ఆరోగ్యంపై వెల్లువెత్తుతున్నఆందోళనలు ఒక కొలిక్కి రాకముందే.. లండన్ డాక్టర్ తిరిగి వెళ్లటం ఎందుకన్న ప్రశ్నకు.. అమ్మ ఆరోగ్యం మెరుగు కావటం.. అవుటాప్ డేంజర్ కావటంతో ఆయన వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. తన అవసరం లేదని.. ఆమె ఆరోగ్యం కుదుట పడిందన్న సమాచారం వస్తోంది.

దీనికి తగ్గట్లే సోమవారం రాత్రి అపోలో విడుదల చేసిన అమ్మ హెల్త్ బులిటెన్ లోని వివరాలు ఉన్నాయి. ఆమె కోలుకుంటున్నారని.. చికిత్సకు ఆమె శరీరం త్వరగా స్పందిస్తుందని.. మరికొద్ది రోజుల్లో అమ్మను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని అందులో పేర్కొనటం గమనార్హం. ఆమె శరీరంలోని ఇన్ఫెక్షన్ తగ్గేందుకు సాధారణ యాంటీ బయాటిక్స్ ను ఇస్తున్నట్లుగా బులిటెన్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. అమ్మ ఆరోగ్యంపై అధికారిక ప్రకటన విడుదల చేయటంతోపాటు.. ఆమెకు సంబంధించిన తాజా ఫోటోను విడుదల చేయాలంటూ ప్రముఖ సామాజిక వేత్త ట్రాఫిక్ రామస్వామి హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేశారు. ప్రజల్లో.. అన్నాడీఎంకే శ్రేణుల్లో నెలకొన్న అంచనాలు నివృత్తి చేసేలా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసేలా హైకోర్టు ఆదేశించాలని ఆయన కోరారు. ఆయన దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

ఇదిలా ఉంటే.. అమ్మ ఆరోగ్యంపై అసత్య ప్రచారం చేసి ఆందోళనలు పెరిగేలా చేశారన్న ఆరోపణపై ప్రాన్స్ కు చెందిన తమిళచ్చిని అదుపులోకి తీసుకునేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేసిన ఆమెను అరెస్ట్ చేసేందుకు భారత రాయబార కార్యాలయం సహకారం తీసుకోనున్నారు. అమ్మ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ కాంగ్రెస్ ఉపాధ్యక్షులురాహుల్ గాంధీతో సహా పలువురు ప్రముఖులు అమ్మకు సందేశాలు పంపారు. మరోవైపు..అమ్మ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ.. పెద్ద ఎత్తున ప్రత్యేకపూజలు తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్నాయి.​


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News