చుక్కేసి యాక్సిడెంట్ చేస్తే హత్యానేరం?

Update: 2017-02-10 07:01 GMT
ఎవరెన్ని చెప్పినా.. ఎన్ని చేదుఅనుభవాలు ఎదురైనా.. ఎన్ని దురదృష్టకర సంఘటనలు అనుభవంలోకి వచ్చినా.. చుక్కేసి బండి నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న కనీస ఆలోచన మనజనాల్లో కనిపించదు. సామాన్యులే కాదు సెలబ్రిటీల్లోనూ ఇదే ధోరణి. మద్యం సేవించి వాహనాలు నడిపిన కారణంగా నిత్యం ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాల గురించి తెలిసినా.. తమ వద్దకు వచ్చేసరికి మాత్రం లైట్ తీసుకునే ధోరణి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారి కారణంగా మద్యం సేవించి వాహనాలు నడిపేవారి సంగతి తర్వాత.. వారి కారణంగా అమాయకులెంతో మంది నిత్యం బలి అవుతున్న వైనాలు మన చుట్టుపక్కలే చాలానే చోటు చేసుకోవటం కనిపిస్తుంది.

కేవలం నిర్లక్ష్యంతో ఇంత దారుణాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరంఉంది. అయితే.. చట్టం అంత కఠినంగా లేని వేళ.. తాజాగా ఆ దిశగా మార్పులు చేసే ప్రయత్నం ఒకటి షురూ అయ్యింది. మద్యం తాగి వాహనాల్ని నడిపి.. అమాయకుల ప్రాణాలు పోవటానికి కారణమైన వారి మీద ఐపీసీ కింద హత్యానేరం మోపాలని.. అందుకు తగ్గట్లు చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది.

రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో తరచూకనిపించే కారణం.. మద్యం సేవించి వాహనాల్ని నడపటమే. వీరి కారణంగా జరుగుతున్న ప్రమాదాలెన్నో. అందుకే ఇలాంటి నేరాలకు పాల్పడే వారి మీద ఉక్కుపాదం మోపాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. మరి ఇందుకు సంబంధించిన సవరణల్నివెంటనే చేసేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. తాగి ప్రమాదాలకు కారణమైన వారికి భారీ శిక్షలు విధించటం.. వాటి గురించి పెద్ద ఎత్తున  ప్రచారం చేయటం ద్వారా.. మద్యం తాగి వాహనాల్ని నడపాలన్నఆలోచన రావటానికి సైతం భయపడేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటే బాగుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News