పోలీసుల‌కు చుక్క‌లు చూపించిన మందుభామ‌

Update: 2018-02-24 05:47 GMT
డ్రంకెన్ డ్రైవ్ పేరుతో ప్ర‌తి వారాంతంలో హైద‌రాబాద్ పోలీసులు నిర్వ‌హిస్తున్నా మందుబాబుల తీరు మార‌టం లేదు. ఈ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డుతున్న వారికి కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌టం.. కొంద‌రికి జైలుశిక్ష విధిస్తున్నా.. ఆ విష‌యాల‌న్నీ మీడియాలో ప్ర‌ముఖంగా వ‌స్తున్నా మందుబాబుల తీరు మార‌టం లేదు.

డ్రంకెన్ డ్రైవ్ కార‌ణంగా వాహ‌నాలు న‌డిపే వారి ప్రాణాల‌కే కాదు.. వారి కార‌ణంగా అమాయ‌కుల ప్రాణాల‌కు ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న చిన్న విష‌యాన్ని ఎందుకు గుర్తించ‌లేక‌పోతున్నార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఇదిలా ఉంటే.. మందుబాబుల్లో కొంద‌రు సంప‌న్నులు పోలీసుల‌తో వాదులాట‌కు దిగ‌టం.. బ్రీత్ ఎన‌లైజ‌ర్ ప‌రీక్ష‌ల‌కు అంగీక‌రించ‌క‌పోవ‌టం క‌నిపిస్తుంది. వీరికి తోడ‌య్యారు మందు భామ‌లు. గ‌తానికి భిన్నంగా మందుభామ‌లు ప‌లువురు పోలీసుల‌తో దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వైఖ‌రి అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. ఈ మ‌ధ్య‌నే మందుభామ‌ల కార‌ణంగా పోలీసుల‌కు చేదు అనుభ‌వం ఎదురైన ఉదంతాన్ని మ‌ర్చిపోక ముందే శుక్ర‌వారం రాత్రి అలాంటి ఉదంత‌మే ఒక‌టి చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ లో శుక్ర‌వారం రాత్రి నిర్వ‌హించిన డ్రంకెన్ డ్రైవ్ లో బ్రీత్ ఎన‌లైజ‌ర్ ప‌రిక‌రాలు స‌రిగా ప‌నిచేయ‌టం లేదంటూ ఒక యువ‌తి పోలీసుల‌తో గొడ‌వ‌కు దిగింది.

ప‌రీక్ష‌కు నో చెబుతూ కారు దిగి వెళ్లిపోయింది. కారు నెంబ‌రు ఆధారంగా ఆమె ఎవ‌రో గుర్తించేందుకు ప్ర‌య‌త్నించిన పోలీసుల‌కు.. వాహ‌నం నెంబ‌రుతో ఎలాంటి చిరునామా రావ‌టం లేదని చెబుతున్నారు. పోలీసుల ప‌ట్ల దురుసుగా వ్య‌వ‌హ‌రించిన స‌ద‌రు మ‌హిళ‌పై ఎలాంటి కేసు న‌మోదు కాలేద‌ని చెబుతున్నారు. ఇయ‌ర్ ఫోన్ పెట్టుకొని వాహ‌నం న‌డిపిన వారికి ఒక‌రోజు జైలు విధిస్తున్న వేళ‌.. పోలీసుల విధి నిర్వ‌హ‌ణ‌కు అడ్డు ప‌డ‌టం.. ప‌రీక్ష‌ల‌కు నిరాక‌రించ‌టం.. వారితో వాదులాట‌కు దిగ‌టం లాంటి వాటి విష‌యంలో కేసు కూడా న‌మోదు చేయ‌రా? అన్న ప్ర‌శ్న‌లు ప‌లువురి నోట వినిపిస్తున్నాయి.  

Tags:    

Similar News