మోడీషా ఎత్తులు: తమిళనాడు ‘ఏక్ నాథ్ షిండే’ అతడేనా?

Update: 2022-07-31 08:30 GMT
దేశ రాజకీయాల తీరును మార్చేసే విషయంలో మోడీషాలు మహా దూకుడును ప్రదర్శిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న ప్రధానమంత్రుల్లో.. విపక్షాల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించిన వారిలో ఇందిరాగాంధీ పేరును పలువురు గుర్తు చేసుకుంటారు. ఆమె ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత మొదలైన అనారోగ్య వాతావరణం.. ఆ తర్వాతి కాలంలో అంతకంతకూ ముదిరినట్లుగా చెప్పాలి. ఎన్నో రాజకీయ వికారాలకు ఇందిర అనే ఐరెన్ ఉమెన్ కారణంగా చెబుతారు.

కట్ చేస్తే.. అప్పటి ఇందిరమ్మను గుర్తు చేసేలా మోడీ తీరు ఉందన్న మాట అంతకంతకూ ఎక్కువ అవుతోంది. లోక్ సభలో రెండంటే రెండు సీట్ల బలం ఉన్న పార్టీ అంతకంతకూ బలపడటం తెలిసిందే. మోడీషాల పుణ్యమా అని ఇప్పుడా పార్టీ తిరుగులేని రీతిలో తయారైంది. అంతకు మించి దేశంలో 18 రాష్ట్రాల్లో కమలం జెండా ఎగురుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు మాత్రమే ఉండాలన్న ఆలోచనతో ఉన్న మోడీషాలు.. ఇప్పటికే అందుకు తగ్గ ఆపరేషన్లు షురూ చేసినట్లుగా చెబుతున్నారు.

తాము ఎంతలా ప్రయత్నించినా.. ఎంతకూ కొరుకుడుపడని దక్షిణాధి రాష్ట్రాల మీద ప్రత్యేక ఫార్ములాతో అధికారాన్ని సొంతం చేసుకోవాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుకున్న అనవసర కయ్యం.. ఇప్పుడు ఆయనకు.. ఆయనకు నమ్ముకున్న నేతలకు.. పారిశ్రామికవేత్తలకు కష్టంగా మారింది. తెలంగాణను క్రమపద్దతిలో పట్టు సాధించాలని పావులు కదుపుతున్న మోడీషాలు..తమిళనాడుకు సంబంధించిన ఫార్ములాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

మహారాష్ట్రలో ఏ రీతిలో అయితే ఉద్దవ్ ఠాక్రేకు చెక్ పెట్టేసి.. ఆయన పార్టీకి చెందిన ఏక్ నాథ్ షిండేను తెర మీదకు తీసుకురావటమే కాదు.. గతంలో మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఫడ్నవీస్ ను డిప్యూటీ సీఎంగా ఉండేందుకు ఒప్పించటం చూస్తే.. తాము ఏమైనా చేయగలమన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసినట్లుగా చెబుతున్నారు. తమిళనాడుకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్ వయసు 69 ఏళ్లు. ఇప్పటివరకు తమిళనాడుకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన నేతలకు భిన్నమైన అధినేతగా చెప్పక తప్పదు. సుదీర్ఘకాలం సీఎం కుర్చీ కోసం నిరీక్షించిన స్టాలిన్.. తన చేతికి అధికారం వచ్చిన నాటి నుంచి తన బలాన్ని మరింత పెంచుకునే పనిలో పడ్డారు. తనను ఎదిరించే ఆలోచన కలలో కూడా రాకూడదన్నట్లుగా ఆయన తీరు ఉన్నట్లు చెబుతారు.

అలాంటి  స్టాలిన్ ఏలుబడిలో ఉన్న తమిళనాడు అధికారపక్షంలో ‘ఏక్ నాథ్ షిండే’ను తెర మీదకు తీసుకురావటం కోసం తెర వెనుక జోరుగా ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో శివసేన మీద చేసిన ప్రయోగాన్ని తమిళనాడులో చేసే దిశగా అడుగులు పడుతున్నట్లుగా చెబుతున్నారు.అయితే.. మహారాజకీయంతో పోలిస్తే తమిళనాడులో పరిస్థితి పూర్తి భిన్నమన్నది మర్చిపోకూడదు. మహారాష్ట్రలో బీజేపీకి ఉన్న బలానికి.. తమిళనాడులో కమలనాథులకు ఉన్న పరిమితుల్ని పట్టించుకోకుండా ముందుకు వెళితే భారీ ఎదురుదెబ్బ తప్పదంటున్నారు.

ఇదిలా ఉండగా.. తాము కోరుకున్నట్లు వ్యవహరించేందుకు వీలుగా డీఎంకేలోని సీనియర్ నేత దొరై మురుగన్ తో మోడీషాలు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. నిజానికి.. మోడీషాల ప్లానింగ్ మూడో కంటికి తెలీనట్లుగా వ్యవహరిస్తారు. అందుకు భిన్నంగా తమిళనాడు ఎపిసోడ్ కు సంబంధించిన వివరాలు బయటకు పొక్కిన నేపథ్యంలో తొందరపాటును పక్కన పెట్టే వీలుందంటున్నారు. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండేలా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతున్న డీఎంకే సీనియర్ నేత విషయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News