ఏపీ హోదా కోసం మరో ఊపిరి ఆగింది

Update: 2015-10-30 05:08 GMT
రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయాలకు మరో ఊపిరి ఆగింది. ఏపీ విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని నాటి ప్రధాని పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక దేశ ప్రధాని ఇచ్చిన హామీని అపహాస్యం చేస్తూ నాటి విపక్షం.. నేటి అధికారపక్షం వ్యవహరిస్తున్న వైఖరికి ఒక సీమాంధ్రుడి గుండె రగిలింది.

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతున్న ఒకరు తాజాగా మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగటూరు మండటం చేబ్రోలుకు చెందిన సుందరపు దుర్గాప్రసాద్ ఆగస్టు 25న ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్నరు. ప్రత్యేక హోదాతో ఏపీ భవిష్యత్తు బాగుంటుందని.. లేనిపక్షంలో సీమాంధ్రులకు కష్టాలు తప్పవన్న ఆవేదన వ్యక్తం చేస్తూ.. వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రత్యేక హోదా కోసం తనను తాను బలిదానం చేసుకుంటున్నట్లు ప్రకటించారు.

ఒంటి మీద కిరోసిన్ పోసుకోవటంతో శరీరం కాలిపోవటం.. వైద్యం కోసం పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఉదయం ఆయన మరణించారు. ఆయనకు భార్య.. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చేబ్రోలులోని ఒక హోటల్ లో పని చేసే దుర్గా ప్రసాద్ సీమాంధ్రుల భవిష్యత్తు కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. ప్రత్యేక హోదాపై కేంద్రం త్వరగా స్పందించి సానుకూల నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News