ఇక దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం మ‌రింత భారం

Update: 2019-11-04 05:39 GMT
ఇక దుర్గమ్మ భక్తులకు ఆర్థిక కష్టాలుఅమ్మలగన్న అమ్మ బెజవాడ దుర్గమ్మ దర్శనం భక్తులకు మరింత భారం కానుంది. వస్తువులు దాచుకోవాలన్నా.. ఫొటోలు దిగాలన్నా.. పైసలు ఇవ్వాల్సిందే మరి. అమ్మవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. కానీ ఆ భక్తుల ఇబ్బందులను పట్టించుకోకుండా వారికి మరింత ఆర్ధిక భారం పెరిగేలా నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. దీంతో అమ్మవారి దర్శనం మరింత ఆర్ధిక భారంగా మారుతుందనే భావన భక్తులలో వ్యక్తమవుతోంది. అమ్మవారిని దర్శించుకుంటే తమ కష్టాలు తీరుతాయని వచ్చే భక్తులను ఆలయ నిర్వాహకులు ఆర్థిక‌భారం మోపేందుకు రెడీ అవుతున్నారు.

ఇక‌పై దుర్గ‌మ్మ స‌న్నిధిలో భక్తులు తమ వస్తువులను దాచుకునేందుకు కూడా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. చెప్పులు, సెల్ ఫోన్లు ఇతర సామాగ్రి  భద్రపరుచుకునేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఈ మేరకు టెండర్లు పిలవాలని దేవస్థానం ఈవో ఎన్ వి సురేష్ బాబు నిర్ణయించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క వస్తువుకు భక్తుల నుంచి ఐదు రూపాయలు వసూలు చేసేలా ఈవో నిర్ణయించారు.  

అంతేకాకుండా అమ్మవారి ఆలయంలో ఫోటోలు దిగడం కూడా అధిక భారంతో కూడుకున్న విషయమే. కొండపైకి చేరుకున్న తర్వాత చిన్న రాజగోపురం, మహా మండపం, పెద్ద రాజగోపురం తదితర ప్రాంతాల్లో ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. అయితే ఇప్పుడు ఫోటోలు దిగాలన్న కూడా డబ్బులు చెల్లించాల్సిందే మరి. ఇక మనకు అక్కడ లైసెన్స్ పొందిన ప్రైవేట్ ఫోటోగ్రాఫర్లు దర్శనమిస్తారు. వారి వద్దనే మనం ఫోటోలు దిగి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. వారు ఎంత చెబితే అంత ఇచ్చి ఫోటోలు దిగాల్సిందే. ఇలా స్పాట్ ఫోటోల కూడా లైసెన్స్ ఇవ్వడానికి నిర్ణయించారు.

దీనికి సుమారు పదహారు నెలల కాల పరిమితితో టెండర్లను పిలుస్తున్నారు. ఈనెల 13న టెండర్లను తెరిచి ప్రైవేటు ఫోటోగ్రాఫర్లకు లైసెన్సు ఇవ్వనున్నారు. ఇలా అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న పరిణామాలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి దర్శనాన్ని ఆర్థిక భారం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై దృష్టి పెట్టకుండా ఇలా డబ్బులు వసూలు పైనే దృష్టి పెట్టడం మంచి పరిణామం కాదన్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News