అచ్చెన్న మీద సంచలన కామెంట్స్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ..?

Update: 2021-11-30 15:30 GMT
అచ్చెన్నాయుడు మాజీ మంత్రి, ఏపీ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్. పాతికేళ్ళుగా చట్ట సభలలో కొనసాగుతున్నారు. ఆయన అన్న కింజరాపు ఎర్రన్నాయుడు అంటే ఇటు గల్లీ నుంచి అటు ఢిల్లీ దాకా తెలియని వారు ఎవరూ లేరు. రాజకీయంగా ప్రాముఖ్యత గడించిన అలాంటి కింజరాపు కుటుంబం అంటే ఉత్తరాంధ్రా జిల్లాలలో  ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి ఫ్యామిలీతో బస్తీ మే సవాల్ అంటూ  రెండు దశాబ్దాలుగా రాజకీయ యుద్ధం కాదు, వ్యక్తిగత యుద్ధమే చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఈ మధ్యనే ఆయనను మెచ్చి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆ విధంగా ఆయన చట్టసభలలో తొలిసారి అడుగు పెట్టినా ఆయన అసలైన కార్యక్షేత్రం మాత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలి శాసనసభ‌గానే చూడాలి.

అక్కడ పాతుకుపోయిన అచ్చెన్నాయుడుని ఎలాగైన ఓడించి తాను ఎమ్మెల్యేగా అడుగు పెట్టాలన్నదే దువ్వాడ శ్రీనివాస్ పంతం. ఇక కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం, ఆ మీదట కొద్ది కాలం పాటు టీడీపీ అక్కడ నుంచి వైసీపీ ఇలా ఎన్ని పార్టీలు మారిన దువ్వాడ లక్ష్యం మాత్రం ఒక్కటే శ్రీకాకుళం జిల్లా రాజకీయాంలో కింజరాపు ఫ్యామిలీని పూర్తిగా పక్కన పెట్టి ఇంటికి పంపించడమే. ఈ ప్రయత్నంలో ఆయన ఓడుతున్నారు. కానీ ఈసారి గెలిచి తీరుతాను అంటున్నారు. యూట్యూబ్ చానల్ చేసిన ఒక ఇంటర్వూలో మనసు విప్పి అనేక విషయాలను పంచుకున్న దువ్వాడ శ్రీనివాస్ అచ్చెన్నతో తనది  ఆజన్మ వైరమే అని తేల్చేశారు. ఆయన రాజకీయ ప్రత్యర్ధి కానే కాదని, తన వ్యక్తిగత శత్రువు అని కూడా స్పష్టం చేశారు.

కింజరాపు ఫ్యామిలీ తనను అన్ని విధాలుగా వేధించిందని, తన ఆస్తులు కూడా ఏమీ కాకుండా చేసిందని, చివరికి ఉన్న ఇల్లు కూడా తెగనమ్ముకుని ఎక్కడికో వెళ్ళిపోయే స్థితిని కల్పించారని ఆయన వాపోయారు. ఈ సమయంలో వైసీపీ తరఫున జగన్  దేవుడిగా ఆదుకున్నారని, తనకు రాజకీయంగా ఒక స్థానం ఇచ్చారని దువ్వాడ చెప్పుకున్నారు. తనను రాజకీయంగానే కాకుండా భౌతికంగా కూడా అంతం చేయాలని కింజరాపు ఫ్యామిలీ చూసిందని సంచలన ఆరోపణలు చేశారు.

తాను ప్రజల కోసం చేసిన అనేక పోరాటాల వల్లనే వారికి కన్నెర్ర అయ్యాయని కూడా చెప్పారు. వ్యవస్థలను అడ్డు పెట్టుకుని అచ్చెన్నాయుడు గెలుస్తున్నారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఆయనకు జనంలో బలం లేదని కూడా పేర్కొన్నారు. ఇక అచ్చెన్నాయుడు తన సొంత గ్రామం నిమ్మాడలో సర్పంచ్ పదవికి ఎవరినీ పోటీ చేయనీయ‌కుండా ఇంతకాలం చేస్తూ వచ్చారని, తొలిసారి కింజరాపు అప్పన్నను అక్కడ నిలబెట్టి తాము ఓడినా గెలిచామని చెప్పారు. నిమ్మాడలో ప్రజలను భయభ్రాంతులు చేయడమే కాదు, ఓట్లు కూడా వేసుకోకుండా రిగ్గింగ్ చేసి గెలవడమే అచ్చెన్న విధానం అని ఆయన ఆరోపించారు.

తన మీద ఏడు మర్డరు కేసులు బనాయించిన అచ్చెన్నాయుడు వాటిలో ఒక్కటైనా నిరూపించగలరా అని సవాల్ చేశారు. తాను నీతికి నిజాయతీకి కట్టుబడి ఉన్నాయని, అలాగే నేరమయ రాజకీయ జీవితం తనకు లేదని దువ్వాడ చెప్పుకున్నారు. అచ్చెన్న తాను అవినీతి చేయేలేదని, నేర రాజకీయాలు లేవని ప్రమాణం చేయగలరా అని సవాల్ చేశారు. రెండెకరాల ఆసాములు అయిన కింజరాపు ఫ్యామిలీకి ఢిల్లీలో, సింగపూరులో కూడా బడా  హొటళ్ళు ఉన్నాయని దువ్వాడ సంచలన ఆరోపణలు చేశారు. మొత్తానికి అచ్చెన్నను ఇరుకున పెట్టేలా శ్రీనివాస్ చేసిన కామెంట్స్ కి మరి ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
Tags:    

Similar News