మెట్రో బంఫ‌ర్ ఆఫ‌ర్:రూపాయికి స్కూట‌ర్

Update: 2018-07-24 04:51 GMT
రూపాయికి స్కూట‌రా?  కామెడీగా ఉందంటూ గుర్రుగా చూడాల్సిన అవ‌స‌రం లేదు. మొత్తం చ‌దివితే విష‌యం అర్థం కావ‌ట‌మే కాదు.. ఇదేమీ రెగ్యుల‌ర్ గా క‌నిపించే ఆఫ‌ర్ ఎట్టి ప‌రిస్థితుల్లో కాద‌న్న అభిప్రాయం వ్య‌క్తం కావ‌టం ఖాయం. ఎందుకంటే.. హైద‌రాబాద్ మెట్రో కు సంబంధించి కీల‌క‌మైన నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

ఆశించిన దాని కంటే త‌క్కువ ఆద‌ర‌ణ‌తో న‌డుస్తున్న హైదరాబాద్ మెట్రోలో ఉన్న ప్ర‌ధాన లోపం .. క‌నెక్టివిటీ లేక‌పోవ‌టం. మెట్రో స్టేష‌న్ వ‌ద్ద‌కు ప్ర‌జా ర‌వాణా లేక‌పోవ‌టం.. అదే స‌మ‌యంలో గ‌మ్య‌స్థానానికి వెళ్లేందుకు వీలుగా స‌రైన ర‌వాణా సౌక‌ర్యాలు లేక‌పోవ‌టం కూడా పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. దీంతో.. మెట్రోలో ప్ర‌యాణించే కంటే ప్ర‌త్యామ్నాయ ప‌ద్ధ‌తులు.. వ్య‌క్తిగ‌త వాహ‌నాల్లో ప్ర‌యాణిస్తున్నారు.

ఇలాంటివేళ‌లో హైద‌రాబాద్ మెట్రో కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది. మెట్రో స్టేష‌న్ల ద‌గ్గ‌ర ఎల‌క్ట్రానిక్ స్కూట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌నుంది. ఆగ‌స్టు 15 నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఎల‌క్ట్రానిక్ స్కూట‌ర్ల‌ను కిలోమీట‌ర్ కు కేవ‌లం ఒక్క రూపాయి అద్దెకు ఇవ్వ‌నున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. కిలోమీట‌రు రూపాయి చొప్పున అద్దెకు ఇచ్చే ఈ- స్కూట‌ర్ కు వెయిటింగ్ ఛార్జిలు వ‌సూలు చేయ‌ర‌ని చెబుతున్నారు. కాకుంటే.. ఎంత‌సేపు వెయిటింగ్‌ ఛార్జ్ లేకుండా చేస్తార‌న్న అంశంపై క్లారిటీ రావాల్సిన అవ‌స‌రం ఉంది.

ఈ-స్కూట‌ర్స్ ను ప‌లు మెట్రో స్టేష‌న్ల ద‌గ్గ‌ర ఏర్పాటు చేయ‌నున్నారు. ఇందుకు సంబంధించిన ఎనిమిది కంపెనీలు వ‌ర‌కూ హైద‌రాబాద్ మెట్రోతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇప్ప‌టికే కొన్ని స్కూట‌ర్ల‌ను ఏర్పాటు చేసినా.. అవ‌న్నీ కిలోమీట‌ర్‌ కు రూ.4 చొప్పున వ‌సూలు చేయ‌నున్నారు. దీని స్థానే.. విద్యుత్ తో న‌డిచే వాహ‌నాల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ విద్యుత్ స్కూట‌ర్ల‌ను తొలుత అమీర్ పేట.. మియాపూర్ మెట్రో స్టేష‌న్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. రానున్న రోజుల్లో స్కూట‌ర్ల‌తో పాటు  కార్ల‌ను సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. పూర్తిగా యాప్ ఆధారంతో న‌డిచే ఈ వాహ‌నం.. లాక్.. ఆన్ లాక్ మొత్తం యాప్ తోనే చేస్తుంద‌ని చెబుతున్నారు. మెట్రో స్టేష‌న్ నుంచి ప‌ని ఉన్న చోటు వ‌ర‌కూ తీసుకెళ్లి.. మ‌ళ్లీ తిరిగి ఇచ్చే సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌నున్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో కీల‌క‌మైన పార్కింగ్ విష‌యంపై మ‌రింత స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. ఇక‌.. ఈ స్కూట‌ర్ కు డ్యామేజ్ కు గురైనా.. త‌స్కర‌ణ‌కు గురైనా ఏం చేస్తార‌న్న దానిపై మ‌రింత స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.
Tags:    

Similar News