‘బడ్జెట్’పై సుప్రీం.. ఈసీ చెప్పిందేమిటి?

Update: 2017-01-24 04:56 GMT
అనుకున్నట్లే జరిగింది. అంచనాలు నిజమయ్యాయి. ఎప్పటి నుంచో వస్తున్న తీరుకు భిన్నంగా..ఈసారి ఫిబ్రవరి ఒకటో తేదీనే బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని.. రైల్వే బడ్జెట్ నుఎత్తేసి.. రెండింటిని కలిపి ఒకే బడ్జెట్ గా ప్రవేశ పెట్టాలన్న మోడీ సర్కారుకు బ్రేకులు వేసేవారు ఎవరూ లేనట్లే. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది.

సుప్రీంకోర్టు తిరస్కరించిన కొద్దిగంటల వ్యవధిలోనే కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాల్ని వెలువరించింది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల ప్రస్తావన లేకుండా బడ్జెట్ లోనిఅంశాలు ఉండాలని పేర్కొంది. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పథకాల వివరాలేవీ బడ్జెట్ లో పేర్కొనకూడదని చెప్పింది. ఈసీ ఆదేశాలతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టే విషయంలో కేంద్రానికి ఉన్న అడ్డంకులు అన్ని తొలిగిపోయాయి.

కేంద్ర బడ్జెట్ ను అడ్డు చెప్పటానికి.. ఓటర్లను ప్రభావితంచేస్తుందన్న అంశానికి సంబంధించి ఒక్క ఉదాహరణ అయినా చూపించాలంటూ వ్యాజ్యాన్నిదాఖలు చేసిన పిటీషన్ దారును సుప్రీం ప్రశ్నించింది. ఈ విషయంలో సంతృప్తికర ఆధారాల్నిచూపించని నేపథ్యంలో బడ్జెట్ ను అడ్డుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఒకవేళ.. బడ్జెట్ లో ఐదు రాష్ట్రాల ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావొచ్చని పేర్కొంది.

రాజ్యాంగంలో కేంద్ర.. రాష్ట్రాల అధికారాలు.. ఉమ్మడి అధికారాలు స్పష్టంగా పేర్కొన్నారని.. అందువల్ల బడ్జెట్ సమర్పణ రాష్ట్రాల ఎన్నికలపై ఆధారపడదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని.. పిటీషన్ దారు చెబుతున్న తీరుచూస్తుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేయకూడదన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించింది.

సుప్రీం నిర్ణయం వెలువడిన కొన్ని గంటలకు ఈసీ ఈ అంశం మీద స్పందించింది. ఐదురాష్ట్రాల ప్రస్తావన లేకుండా బడ్జెట్ ఉండాలని చెప్పింది. ఈ నేపథ్యంలో రానున్న బడ్జెట్ లో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల ప్రస్తావన ఏ మాత్రం ఉండదని చెప్పక తప్పదు. అంటే..ఈసారి బడ్జెట్ మీద ఈసీ ముద్ర ఉంటుందని చెప్పక తప్పదు. మొత్తంగా కేంద్రం అనుకున్నట్లే.. ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టటం ఖాయమైనట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News