షాకు నోటీసుల‌తో కార్న‌ర్ చేస్తున్నారు

Update: 2018-08-14 06:06 GMT
పిడిగుద్దుల్లాంటి ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డే వారిని ఎలా క‌ట్ట‌డి చేయాలి? అన్న స‌మ‌స్య‌కు కాంగ్రెస్.. తృణ‌మూల్ కాంగ్రెస్ లు స‌రికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకున్నాయి. త‌మ‌పై అదే ప‌నిగా విమ‌ర్శ‌లు చేసే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు దిమ్మ తిరిగేలా వేర్వేరు ప్లాన్లు సిద్ధం చేశాయి.

ఇటీవ‌ల షా ఆస్తుల‌కు సంబంధించి రూ.25 కోట్ల అప్పు లెక్క ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌టం తెలిసిందే. ఈ వివ‌రాల్ని అమిత్ షా త‌న నామినేష‌న్లో పేర్కొన‌లేదంటూ కాంగ్రెస్ ఇప్పుడు కొత్త అస్త్రాన్ని తెర మీద‌కు తీసుకొచ్చింది. ఎన్నిక‌ల నామినేష‌న్లో త‌న వివ‌రాల్ని వెల్ల‌డించ‌ని అమిత్ షాపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోరుతూ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

ఏదో మాట వ‌ర‌స‌కు డిమాండ్ చేసి వ‌దిలేయ‌కుండా.. పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు.. ప్ర‌ముఖ లాయ‌ర్లు అయిన క‌పిల్ సిబల్‌.. అభిషేక్ సింఘ్వీ.. వివేక్ తంఖాల‌తో కూడిన కాంగ్రెస్ నేత‌ల బృందం సీఈసీ ఓం ప్ర‌కాశ్ రావ‌త్ ను క‌లిశారు. షాపై వేటు వేయాల‌న్న విన‌తిప‌త్రాన్ని ఇచ్చారు. అయితే.. కాంగ్రెస్‌నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌లు ఉత్త బోగ‌స్ గా బీజేపీ కొట్టి పారేస్తోంది.

ఇదిలా ఉంటే.. అమిత్ షాపై తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ నేత లీగ‌ల్ నోటీస్ పంపారు. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీ తాజాగా షాకు నోటీసులు పంపుతూ.. ఇటీవ‌ల కోల్ క‌తా ర్యాలీలో పార్టీపైనా.. త‌న‌పైనా ప‌రువున‌ష్టం క‌లిగేలా వ్యాఖ్య‌లు చేయ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు. త‌మ‌కు వెంట‌నే షా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేసినా ప‌ట్టించుకోలేద‌ని.. అందుకే తాను లీగ‌ల్ నోటీసులు పంపుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  రెండు పార్టీలు రెండు భిన్న అంశాల‌తో షాను టార్గెట్ చేసిన వైనంపై ఆయ‌న ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News