5000 కోట్లతో పెళ్లి.. ప్ర‌పంచ కుభేరుడి జీవితంలో ట్విస్ట్

ఇప్పుడు మ‌రో 5000 కోట్ల బ‌డ్జెట్ పెళ్లి గురించి వ‌ర‌ల్డ్ వైడ్ చ‌ర్చ సాగుతోంది. అత‌డు కూడా ప్ర‌పంచ సుప్ర‌సిద్ధ‌ కుభేరుడు. అత‌డి పేరు జెఫ్ బెజోస్.

Update: 2024-12-23 03:48 GMT

ఇటీవ‌లే త‌న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి కోసం ప్ర‌పంచ కుభేరుడు ముఖేష్ అంబానీ ఏకంగా 5000 కోట్లు ఖ‌ర్చు చేసాడు. కొన్ని నెల‌ల పాటు సాగిన అనంత్ అంబానీ- రాధిక మ‌ర్చంట్ ల‌ అంగ‌రంగ వైభ‌వ పెళ్లి వేడుక‌ల‌ కోసం డబ్బును మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు చేసిన అంబానీ గురించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ సాగింది. ప్ర‌పంచంలోనే అత్యంత విలాస‌వంత‌మైన పెళ్లి ఇద‌ని ప్ర‌జ‌లు చ‌ర్చించుకున్నారు.

ఇప్పుడు మ‌రో 5000 కోట్ల బ‌డ్జెట్ పెళ్లి గురించి వ‌ర‌ల్డ్ వైడ్ చ‌ర్చ సాగుతోంది. అత‌డు కూడా ప్ర‌పంచ సుప్ర‌సిద్ధ‌ కుభేరుడు. అత‌డి పేరు జెఫ్ బెజోస్. వచ్చే వారాంతంలో కాబోయే భార్య లారెన్ సాంచెజ్ ని పెళ్లాడేందుకు 5000 కోట్లు (600 మిలియన్ డాల‌ర్లు) ఖ‌ర్చు చేయ‌నున్నాడ‌ని, ఈ విలాసవంతమైన వివాహానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అతిథులు విచ్చేస్తార‌ని ప్ర‌చార‌మైంది.

బెజోస్ -సాంచెజ్ ల నిశ్చితార్థం 2023మేలో అయింది. బెజోస్ విడాకుల తర్వాత 2018లో సాంచెజ్ తో డేటింగ్ ప్రారంభించారు. ఇప్పుడు పెళ్లితో ఒక‌ట‌వుతున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. కొలరాడోలోని ఆస్పెన్‌లో కెవిన్ కాస్ట్‌నర్ యాజమాన్యంలోని 160 ఎకరాల గడ్డిబీడులో వేడుకలు జ‌ర‌గ‌నున్నాయ‌ని, అతిథుల కోసం ఆ ప్రాంతంలోని సుషీ రెస్టారెంట్, ప్రైవేట్ మాన్షన్‌లను అద్దెకు తీసుకున్నారని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి.

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం. 60 ఏళ్ల‌ బెజోస్, 55 ఏళ్ల‌ సాంచెజ్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. మెకెంజీ స్కాట్‌తో బెజోస్ విడాకులు తీసుకున్న తర్వాత 2019లో ఈ సంబంధానికి సంబంధించిన వార్తలు పబ్లిక్‌గా మారాయి. ఆ త‌ర్వాత‌ మే 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. బెజోస్ సుమారు 22 కోట్ల (2.5 మిలియన్ డాల‌ర్లు) విలువైన 20-క్యారెట్ డైమండ్ రింగ్‌ని సాంచెజ్ వేలికి తొడిగారు.

ఖండించిన బెజోస్‌:

అయితే త‌న పెళ్లి గురించి వ‌స్తున్న వార్త‌ల‌ను `పూర్తిగా త‌ప్పు` అని ఖండించారు జెఫ్ బెజోస్. ఆదివారం నాడు బెజోస్ X లో ఇలా రాసారు. ``ఈ మొత్తం విషయం పూర్తిగా తప్పు - ఇవేమీ జరగడం లేదు`` అని రాసాడు. చదివిన ప్రతిదాన్ని నమ్మవద్దని, అబద్ధాలు వేగంగా ప్ర‌చార‌మ‌వుతాయ‌ని త‌న ఫాలోవ‌ర్స్ ని హెచ్చ‌రించాడు. మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌ను అస్స‌లు న‌మ్మొద్ద‌ని అన్నారు.

Tags:    

Similar News