ఈడీ దాడులే కాదు అరెస్టులు కూడా...గులాబీ పార్టీకి ముళ్ళ బాట

Update: 2022-11-11 07:15 GMT
కేంద్రంతో పెట్టుకుంటోంది గులాబీ పార్టీ. కేసీయార్ ఒక రాష్ట్రానికి సీఎం. దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే భౌగోళికంగా చూసినా లెక్క  ఎంపీల   సీట్ల పరంగా చూసినా పదవ స్థానాన్ని దాటి తెలంగాణా ఉంది. అలాంటి ఒక చిన్న రాష్ట్రమే బలమైన బీజేపీని, కేంద్రంలోని మోడీని అమిత్ షాలను సవాల్ చేస్తే ఇంకేమైనా ఉంటుందా. టాప్ టెన్ లో ఉన్న రాష్ట్రాలలోని బీజేపీ ప్రత్యర్ధులు చెలరేగిపోరూ. అందుకే టీయారెస్ లెక్కలను తమకు ఉన్న అధికార హక్కులతోనే తేల్చాలని కేంద్ర బీజేపీ భావిస్తోంది.

ఫలితంగా ఎన్నడూ లేని విధంగా ఒక హిట్ లిస్ట్ ని రెడీ చేసి మరీ టీయారెస్ వారి రాజకీయ జాతకాలను తిరగరాసే పనిలో బీజేపీ ఉందని అంటున్నారు. ఇపుడు చాలా చురుకుగా ఈడీ ఐటీ  రెండూ తెలంగాణాలో వరసబెట్టి దాడులు చేస్తున్నాయి. అందులోనూ టీయారెస్ నేతలే లక్ష్యంగా చేసుకుంటూ దూకుడుని ప్రదర్శిస్తున్నాయి. ఈ విధంగా చూస్తే మంత్రులు ఎంపీలతో పాటు కీలక నేతల చిట్టా అంతా ఈడీ దగ్గర ఉంది అంటున్నారు.

ప్రత్యేకించి గ్రానైట్ వ్యాపారం చేసేవాఇ మీదనే గురి పెట్టి ఈ దాడులు చేస్తున్నారు అని అంటున్నారు. గ్రానైట్ వ్యాపారం అంటే అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే  సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కరుణా కటాక్షాలను సంపాదించుకుంటే తిరుగు ఉండదు, మరి కేంద్ర జోక్యం ఎక్కడ ఉంటుంది. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల వ్యవహారం ఎలా వస్తుంది అంటే అక్కడే ఉంది తమాషా.

ఇతర దేశాలకు ఈ గ్రానైట్ ఎగుమతులు పెద్ద ఎత్తున చేస్తారు. అత్యంత ఖరీదైన ఈ గ్రానైట్ ని ఎక్స్ పోర్ట్ చేసేటపుడు తూనికలు కొలతల్లో భారీ ఎత్తున అక్రమాలు చేస్తూ అందులోనే విపరీతమైన లాభాలను గ్రానైట్ వ్యాపారులు గడిస్తూ ఉంటారు. అంతే కాదు ఎక్కువ మోతాదులో ఎగుమతులు చేసి తక్కువ ఎగుమతులు చూపించి ఆ మేరకే పన్నులు కడుతూంటారు. ఆలా కేంద్ర ఆదాయానికి ఎగవేత చేస్తుంటారు.

ఇలా రెండిందాల లాభాలను గడిస్తూ బోల్తా కొట్టిస్తూంటారు. ఇక ఇలాంటి లొసుగులు ఇబ్బందులను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి గ్రానైట్ వ్యాపారులు దగ్గరగా ఉంటారు. కొందరైతే వారికి అనధికారికంగా పార్టీ కోసం ముడుపులు పెద్ద ఎత్తున చెల్లిస్తూ వారితో అంటకాగుతూంటారు. దీంతో వీరిని చూసీ చూడనట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వదిలేసినా ఇపుడు బీజేపీని సవాల్ చేస్తున్న క్రమంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు వీరి మీద గురి పెట్టేశాయి.

దాంతో పాటు వీరి అసలు కధను అవినీతి భాగోతాలను కూడా వెలికితీసే పనిలో ఐటీ ఈడీ రెండూ కలసి ఒక్కసారిగా చేపడుతున్నాయి. ఇపుడు మంత్రి గంగుల కమలాకర్ మీద దాడులు చేసిన ఈడీ ఐటీ ఈ మధ్యనే రాజ్యసభ ఎంపీగా టీయారెస్ తరఫున అయిన గాయత్రి రవి సంస్థల మీద దాడులు చేపట్టాయని అంటున్నారు. ఈ గాయత్రి రవి గురించి కూడా ప్రత్యేకంగా ఆరా తీస్తే అనేక కీలకమైన విషయాలు బయటపడ్డాయని అంటున్నారు.

ఆ మధ్యన ఆయన ఢిల్లీలో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున అనుచరులను ప్రత్యేక విమానంలో తీసుకెళ్ళారని అంటున్నారు. ఇక ఆయన పెడుతున్న ఖర్చులను చూసి ఈడీ ఐటీ ఆశ్చర్యపోయాయి అని అంటున్నారు. అంటే ఇంత డబ్బు ఎలా వచ్చింది ఎక్కడ నుంచి వచ్చి ఎలా వెళ్తోంది అన్న దాన్ని ఆరా తీసే పనిలో ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు ఉన్నాయని అంటున్నారు.

ఈ నేపధ్యంలో టీయారెస్ లో చేరిన వారు, అధికారికంగా పదవులు అందుకున్న వారు, వారితో అంటకాగుతున్న వారు అంతా కలసి ఇపుడు హడలిపోతున్నారు. అయితే దీని మీద కేసీయార్ కూడా ఫోకస్ పెట్టారని, కేంద్రం తన ఏజెన్సీలతో ఈ విధంగా చేయించడాన్ని గమనిస్తున్నారని, దీనిని ఎలా ఎదుర్కోవాలి అన్నది కూడా ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు.

ఇప్పటికైతే ఇలాంటి పరిణామాలు ఉంటాయని ముందే ఊహించిన టీయారెస్ అధినాయకత్వం ఆ మేరకు అలెర్ట్ అయిందని, ప్రతి వ్యూహాన్ని రూపొందిస్తోందని అంటున్నారు. అయితే ఒకరిద్దరు టీయారెస్ నేతలతో ఈ దాడులు ఆగే వ్యవహారం కాదని, చాలా పెద్ద హిట్ లిస్ట్ ఉందని టీయారెస్ అంచనా వేస్తోంది.

దాంతో పాటు భారీ ఎత్తున అరెస్టులు కూడా ఉంటాయని కూడా ఆలోచిస్తున్నారు. మొత్తానికి టీయారెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఒక వైపు రాజకీయం సాగుతూంటే ఈ దాడులు అరెస్టులతో మొత్తానికి మొత్తం తెలంగాణా రాజకీయం పూర్తిగా వేడెక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News