'మహా' పోల్స్ ముంగిట..ఎన్సీపీ చీఫ్ పవార్ పై కేసు

Update: 2019-09-25 04:40 GMT
గతంలో దేశంలో ఎక్కడ ఎన్నికలకు రంగం సిద్ధమైనా... అక్కడ రాజకీయ కోలాహలం మొదలైపోయేది. అయితే ఇప్పుడు దేశంలో ఎక్కడ ఎన్నికలకు రంగం సిద్ధమైపోయినా.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలపై కేసులు నమోదైపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ తరహాలో పలు కేసులు నమోదు కాగా... ఇప్పుడు దేశంలోనే కీలక రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ... ఆ రాష్ట్రంలో మంగళవారం ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తంపు సంపాదించుకోవడంతో పాటుగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత - కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ పై ఏకంగా మనీ లాండరింగ్ కేసు నమోదైపోయింది. శరద్ పవార్ తో పాటు ఆయన అల్లుడు అజిత్ పవార్ పైనా మనీ లాండరింగ్ కేసు నమోదు చేస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా పెను కలకలం రేపుతున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే... మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు జారీ చేసిన రూ.25 వేల కోట్ల రుణాల వ్యవహారానికి సంబంధించి శరద్ పవార్ తో పాటు అజిత్ పవార్ - ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్లుగా వ్యవహరించిన పలువురిపైనా ఈడీ కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణ ఏమిటంటే... రాష్ట్రంలోని పలు చక్కెర కర్మాగారాలకు మహారాష్ట్ర స్టేట్ కో- ఆపరేటివ్ బ్యాంకు భారీ రుణాలిచ్చేసింది. ఇలా చక్కెర కర్మగారాలకే ఆ బ్యాంకు ఏకంగా రూ.25,000 వేల కోట్లను మంజూరు చేసింది. ఈ రుణాలన్నీ వసూలు కాలేదట. అంతేకాకుండా భారీ రుణాలు తీసుకున్న ఈ కర్మాగారాలన్ని దివాలా తీయగా వాటిని బ్యాంకు వేలం వేసింది. ఈ వేలంలో బ్యాంకు డైరెక్టర్లుగా వ్యవహరించిన వారు తమకు అనుకూలంగా ఉన్నవారికే కారుచౌకగా కట్టబెట్టేశారట. ఈ మొత్తం వ్యవహారం శరద్ పవార్ - ఆయన అల్లుడు అజిత్ పవార్ కనుసన్నల్లోనే జరిగాయన్నది ఆరోపణ.

ఇప్పటికే ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తుండగా... సరిగ్గా ఎన్నికలకు ముందర ఎంట్రీ ఇచ్చిన ఈడీ.. శరద్ - అజిత్ లపై మనీ లాండరింగ్ కేసులు నమోదు చేసింది. సరిగ్గా ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ శరద్ పవార్ పై కేసు నమోదు కావడంతో ఎన్సీపీతో పాటు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీలు మహారాష్ట్ర సర్కారుతో పాటు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుపై విరుచుకుపడ్డాయి. శివసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగుతున్న బీజేపీ... ప్రత్యర్థులను వ్యూహాత్మకంగా దెబ్బ తీసే ప్లాన్ లో భాగంగానే ఈ కేసులు పెట్టిందని ఎన్సీపీ - కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. అదేదో ఈ కేసు ఇప్పుడే వెలుగుచూసినట్లుగా సరిగ్గా ఎన్నికలకు రంగం సిద్ధమైన సమయంలోనే శరద్ పవార్ పై కేసు నమోదు చేశారంటే... బీజేపీ వ్యూహం అదే కదా అని కూడా ఆ పార్టీలు విరుచుకుపడ్డాయి. ఇప్పటికే ఎన్నికల సన్నాహాలు మొదలైన మహారాష్ట్రలో ఇప్పుడు శరద్ పవార్ పై కేసు నమోదుతో ఒక్కసారిగా అక్కడి రాజకీయం వేడెక్కిందనే చెప్పాలి.

   

Tags:    

Similar News