టీడీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్న ఈడీ ... ఆ 3 స్కాంలపై దర్యాప్తు !

Update: 2020-06-16 06:45 GMT
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతిలో రాజధాని పేరుతో చోటు చేసుకున్న భూముల అక్రమాలపై ఈడీ దర్యాప్తు ప్రారంభమైంది. నిన్న సాయంత్రమే విజయవాడ చేరుకున్న ఈడీ బృందాలు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అన్నిశాఖల అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఒకవైపు నేడే ప్రరమమైయ్యాయి. ఈ తరుణంలో ఈడీ దర్యాప్తు విపక్ష టీడీపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది.

గత ప్రభుత్వ  హయాంలో అమరావతిలో రాజధాని వస్తుందని ముందుగా పార్టీ నేతలకు లీకులిచ్చి బినామీ పేర్లతో భూములు కొల్లగొట్టిన వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో సేకరించిన వివరాల ఆధారంగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. సీఐడీ దర్యాప్తులో 700 మంది తెల్ల రేషన్ కార్డు దారుల పేరుతో భూములను కొల్లగొట్టాలని గుర్తించారు. దీంతో ముందుగా ఈ వ్యవహారం పై సీఆర్డీయే అధికారుల నుంచి ఈడీ బృందాలు వివరాలు సేకరిస్తున్నాయి. అదే సమయంలో సదరు భూముల రిజిస్టేషన్లకు సంబంధించి ల్యాండ్‌ పూలింగ్‌లో రిటర్నబుల్‌ ప్లాట్లు దక్కించుకున్నది ఎవరు? వాటిని ఎవరికి విక్రయించారు? తదితర వివరాలపై సీఐడీతో పాటు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌, సీఆర్‌ డీఏ అధికారులతో నాగార్జున యూనివర్సిటీలో సుదీర్ఘంగా చర్చించారు.

సీఐడీ అధికారులు ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని ఈడీ వారి నుంచి సేకరించడంతో పాటు దాన్ని విశ్లేషించే పనిలో నిమగ్నమైంది. ఓసారి ఈ డేటాపై అవగాహన వచ్చాక తదుపరి అంశాలపై దృష్టిసారిస్తారు. అమరావతి భూముల స్కాంపై దర్యాప్తు కోసం విజయవాడ వచ్చిన నాలుగు ఈడీ బృందాలు రాజధాని భూములతో పాటు అగ్రిగోల్డ్ కుంభకోణం, తాజాగా బయటపడిన ఈఎస్ఐ స్కాంపైనా వివరాలు సేకరిస్తున్నాయి. విజిలెన్స్, ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ చెబుతున్నట్లుగా రూ.988 కోట్ల నిధుల్లో అత్యధిక భాగం కేంద్ర ప్రభుత్వ వాటా కావడంతో ఈడీ ఈ వ్యవహారంపైనా ఆరా తీస్తోంది

ఓ వైపు బడ్జెట్ ఆమోదం కోసం ఏపీ అసెంబ్లీ సమావేశమవుతున్న వేళ గత టీడీపీ సర్కారు హయాంలో చోటు చేసుకున్న అమరావతి భూములు, ఈఎస్ఐ, అగ్రిగోల్డ్ స్కాంలలో ఈడీ దర్యాప్తుకు సిద్ధం కావడం ఆ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. తమ పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టులను కక్షసాధింపుగా అభివర్ణిస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని భావించిన టీడీపీకి ఈడీ దర్యాప్తు మింగుడు పడటం లేదు.
Tags:    

Similar News