టీ-కాంగ్రెస్ నేత‌ల‌కు ఈడీ నోటీసులు.. రీజ‌న్ ఇదే

Update: 2022-09-23 06:39 GMT
దేశంలో కొన్నాళ్ల కింద‌ట తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌.. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు.. ఇప్పుడు.. తెలంగాణ వ‌రకు వ‌చ్చింది. ఈ కేసును కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు.. అగ్ర నేత‌లు.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల‌ను ఈడీ అధికారులు ప‌లుమార్లు విచారించారు. దాదాపు త‌న‌ను 30 గంట‌ల పాటు.. ఈడీ అధికారులు విచారించార‌ని.. రాహుల్ స్వ‌యంగా చెప్పారు. ఇక‌, సోనియాను కూడా.. రెండు సార్లు ఈడీ ప్ర‌శ్నించింది. నేష‌న‌ల్ హెరాల్డ్ ఆస్తుల కేసు కీల‌కంగా మారిన నేప‌థ్యంలో ఇప్పుడు.. ఈ సెగ తెలంగాణ వ‌ర‌కు చేరింది.

తెలంగాణ‌లోని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ల‌ను కూడా ఈడీ అధికారులు విచారించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో మాజీ మంత్రి.. ఫైర్ బ్రాండ్ రేణుకాచౌద‌రికి ఈడీ అధికారులు తాజాగా నోటీసులు జారీచేశారు.

అదేవిధంగా మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీ, సీనియ‌ర్ నాయకుడు సుద‌ర్శ‌న్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. అక్టోబ‌రు 10వ తారీకున ఢిల్లీలోని ఈడీ కార్యాయాల‌నికి రావాల‌ని.. నోటీసుల్లో పేర్కొంది. ఈ మేర‌కు.. ఆయా నేత‌ల‌కు ఈ నోటీసులు అందాయి. మ‌రి ఈ వ్య‌వ‌హారంపై వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఈ కేసు ఏంటంటే..నేషనల్ హెరాల్డ్ అనే వార్తా పత్రికను ప్రచురించే సంస్థను కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిధులను దుర్వినియోగం చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ మేరకు 2012లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి.. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేసు పెట్టారు. సోనియా, రాహుల్ గాంధీలు వేల కోట్ల రూపాయల మేర మోసం చేశారని, భూకబ్జాలకు పాల్పడ్డారని పేర్కొంటూ స్వామి 2012 నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని కోర్టులో ఫిర్యాదు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ద్వారా ఢిల్లీ, యూపీ, ఇతర ప్రాంతాల్లో రూ. 1,600 కోట్ల రూపాయల విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఆస్తులను మోసపూరితంగా స్వాధీనం చేసుకున్నారని తన ఫిర్యాదులో ఆరోపించారు.

నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ ను జవహర్ లాల్ నెహ్రూ 1938లో ప్రారంభించారు. కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్లు కలిసి 1937లో స్థాపించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఈ పత్రికను పబ్లిష్ చేసింది. ఆ గ్రూపులో సుమారు ఐదు వేలమంది ఫ్రీడమ్ ఫైటర్లు షేర్ హోల్డర్లుగా ఉండేవారు.

అనతికాలంలోనే నేషనల్ హెరాల్డ్ పేపర్ ఒక జాతీయవాద పత్రికగా పేరు పొందింది. అయితే ఆర్థిక కారణాలతో 2008లో ఈ న్యూస్ పేపర్ సేవలు నిలిచిపోయాయి. పేపర్ ప్రచురణను కూడా నిలిపివేశారు. కానీ 2016 నుంచి డిజిటల్ పబ్లికేషన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 2010 నాటికి AJLకి 1,057 మంది వాటాదారులు ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News