మోడీ షెడ్యూల్ ఎంత‌మాత్రం కాదు.. సొంత లెక్క‌లున్నాయ‌ట‌!

Update: 2019-03-08 04:31 GMT
ప్రాంతీయ వార్తా చాన‌ళ్లు.. ప‌త్రిక‌ల్లో పెద్ద హ‌డావుడి క‌నిపించ‌టం లేదు కానీ.. జాతీయ మీడియా సంస్థ‌ల్లో ఒక అంశం మీద పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. జాతీయ పార్టీల నేత‌లు సైతం ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ మీద ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆరోప‌ణలు వెల్లువెత్తుతున‌నాయి. ఇదంతా దేని మీద‌నో కాదు.. త్వ‌ర‌లో జ‌ర‌గాల్సిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఎన్నిక‌ల షెడ్యూల్ ను విడుద‌ల చేయ‌టంలో సాగుతున్న ఆల‌స్యం మీద‌న‌.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ కు సంబంధించిన ప్ర‌క‌ట‌న మార్చి 2న విడుద‌లైంది. ఆ లెక్క‌న చూస్తే.. ఈ సారి ఆరు రోజులు ఎక్కువైంది. ఈ ఆల‌స్యానికి కార‌ణంగా మోడీ మాష్టారి నుంచి సిగ్న‌ల్ రాక‌పోవ‌ట‌మే అన్న ఆరోప‌ణ వినిపిస్తోంది. గ‌డిచిన మూడు వారాలుగా చూస్తే.. కేంద్ర స‌ర్కారు దూకుడు పెంచ‌టం.. ప‌లు నిర్ణ‌యాల్ని హ‌డావుడి తీసుకోవ‌టం లాంటివి క‌నిపిస్తాయి.

ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌భ‌ల్ని మోడీ ఇప్ప‌టికే నిర్వ‌హిస్తున్నారు. ఎన్నిక‌ల గంట మోగే నాటికి దేశంలోని న‌లుమూల‌ల్లోని ముఖ్య‌మైన ప్రాంతాల్లో స‌భ‌లు పెట్టుకోవాల‌న్న ల‌క్ష్యం పూర్తి కాని కార‌ణంగానే ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌ను ఆపిన‌ట్లుగా విమ‌ర్శ వినిపిస్తోంది. ప్ర‌తి రాష్ట్రానికి వెళ్ల‌టం.. మ‌న‌సును దోచే హామీని ఇవ్వ‌టం లాంటివి  ప్ర‌ధాని మోడీ చేస్తున్నార‌ని.. ఇది ఏ మాత్రం స‌రైన‌ది కాద‌న్న అభియోగాన్ని ప‌లువురు పార్టీ నేత‌లు చేస్తున్నారు.

ఈ విమ‌ర్శ‌ల తీవ్ర‌త పెరిగిపోవ‌టంతో.. ఆల‌స్యానికి కార‌ణం చెప్ప‌కుండా.. విమ‌ర్శ‌ల‌కు చెక్ చెబుతూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా రియాక్ట్ అయ్యింది. ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించ‌కుండానే ఈసీ ఉద్దేశ‌పూర్వ‌కంగా ఆల‌స్యం చేయ‌టం లేద‌న్న మాట‌ను చెబుతూ.. షెడ్యూల్ ఎందుకు విడుద‌ల కాలేద‌న్న దానిపై అస్ప‌ష్ట‌మైన వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.

ప్ర‌ధాని షెడ్యూల్ ప్ర‌కారం తాము ప‌ని చేయ‌మ‌ని.. త‌మ‌కంటూ సొంత షెడ్యూల్ ఉంద‌న్న ఈసీ.. ఆల‌స్యానికి చెప్పిన కార‌ణం అతికిన‌ట్లుగా లేదన్న విమ‌ర్శ వినిపిస్తోంది.త‌మ‌కంటూ సొంత షెడ్యూల్ ఉంద‌ని.. గ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు 2014 మే 11 లోపు రావాల్సి ఉంద‌ని.. అందుకే అప్ప‌ట్లో ఎన్నిక‌ల షెడ్యూల్ మార్చి 5న ప్ర‌క‌టించార‌న్నారు.  వ‌చ్చే లోక్ స‌భ ఫ‌లితాలు జూన్ 3 లోపు వెలువ‌డాల్సి ఉంద‌ని.. ఇంకా స‌మ‌యం ఉంద‌ని.. ఆల‌స్యం ఏమీ జ‌ర‌గ‌లేద‌న్న స‌మ‌ర్థింపును చేసుకున్నారు.

16వ లోక్ స‌భ తొలి స‌మావేశం 2014 జూన్ 4న జ‌రిగింద‌ని.. ఆ లెక్క‌న జూన్ 3 వ‌ర‌కూ గ‌డువు ఉంద‌ని.. 17వ లోక్ స‌భ స‌మావేశం ఆ లోపు జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న విడుద‌ల కావ‌టానికి భార‌త్.. పాక్ ల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు కూడా కార‌ణంగా చెబుతున్నారు. మొత్తంగా త‌మ మీద వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు సూటిగా స‌మాధానం చెప్ప‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. అందులోని కొంద‌రు ముఖ్యులు తెర వెనుక మాట్లాడిన మాట‌లే ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మొత్తంగా చూస్తే.. ఎన్నిక‌ల షెడ్యూల్ ఏ క్ష‌ణంలో అయినా విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News