డిగ్గీకి ఈసీ 'క్లీన్ చిట్'..క‌మ‌ల‌నాథులు కామ్ కావాల్సిందే!

Update: 2019-05-18 11:32 GMT
సార్వత్రిక ఎన్నిక‌ల్లో ఏడో ద‌శ పోలింగ్ కు ఒక్క‌రోజు ముందు కాంగ్రెస్ సంతృప్తి చెందే ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది. ఆ పార్టీ సీనియ‌ర్ నేత భోపాల్ కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థి దిగ్విజ‌య్ సింగ్ మీద చేసిన ఆరోప‌ణ‌ల్లో ప‌స లేద‌ని ఈసీ తేల్చేసింది. క‌మ‌ల‌నాథులు ఇచ్చిన కంప్లైంట్ నిజం కాద‌ని పేర్కొంటూ.. డిగ్గీ కోడ్ ఉల్లంఘించ‌లేద‌ని తేల్చేసింది.

భోపాల్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా దిగ్విజ‌య్ సింగ్.. బీజేపీ అభ్య‌ర్థిగా సాధ్వి ప్రఙ్ఞాసింగ్ బ‌రిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇరువురి మ‌ధ్య పోటాపోటీ న‌డుస్తోంది. సాధ్వీని ఎదుర్కొనేందుకు డిగ్గీ రాజా ప‌లువురు స్వాముల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌టంతో పాటు.. హిందుత్వ అంశాల మీద కాస్త దృష్టి సారించారు. బాగా ఫేమ‌స్ అయిన కంప్యూట‌ర్ బాబా(సాధూ నామ్ దేవ్ త్యాగి) తో క‌లిసి ఇటీవ‌ల రోడ్ షో నిర్వ‌హించారు. బీజేపీ హ‌యాంలో కంప్యూట‌ర్ బాబాకు బీజేపీ స‌ర్కారు నర్మ‌దా ప‌రిశుభ్ర‌త ప్యానెల్ లో స‌హాయ‌మంత్రి హోదా క‌ట్ట‌బెట్టారు. అయితే.. బీజేపీ తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయ‌న తాజాగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు.

కంప్యూట‌ర్ బాబాతో క‌లిసి డిగ్గీరాజా నిర్వ‌హించిన రోడ్ షోలో కొంద‌రు మ‌హిళ‌లు కాషాయ రంగు స్టోల్స్ ధ‌రించిన తీరు కార్య‌క్ర‌మానికి హైలెట్ గా మారింది. అయితే.. వారు పోలీసుల‌ని.. అలా కాషాయ స్ట్రోల్స్ ధ‌రించ‌టం పైన బీజేపీ నేత‌లు కంప్లైంట్ ఇచ్చారు. మ‌హిళా పోలీసుల‌ను రోడ్ షోకు వాడుకున్నార‌ని బీజేపీ ఆరోపించింది.

ఈ నేప‌థ్యంలో ఈ ఫిర్యాదుపై దృష్టి సారించిన ఎన్నిక‌ల సంఘం స్థానిక అధికారుల నుంచి నివేదిక తెప్పించుకుంది. ఈ రిపోర్ట్ లో స‌ద‌రు మ‌హిళ‌లు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ని.. ఎండ వేడిమి నుంచి త‌ట్టుకోవ‌టానికి వీలుగా కాషాయ స్ట్రోల్స్ ధ‌రించిన‌ట్లుగా పేర్కొన్న‌ట్లు తెలిపింది. కోడ్ ను డిగ్గీ రాజా ఉల్లంఘించ‌లేద‌ని స్పష్టం  చేసింది. ఈసీ నుంచి క్లీన్ చిట్ రావ‌టం కాంగ్రెస్ కు మ‌రింత మ‌నోధైర్యం క‌లిగించే అంశంగా చెబుతున్నారు.  
Tags:    

Similar News