ఎన్నిక‌ల వేళ సోష‌ల్ మీడియాకు ఈసీ కండిష‌న్లు!

Update: 2019-03-11 04:13 GMT
దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల గంట మోగిన సంగ‌తి తెలిసిందే. గ‌డిచిన కొంత‌కాలంగా మీడియాకు మించి సోష‌ల్ మీడియా హ‌వా ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌టం.. దానికంటూ ప్ర‌త్యేక మార్గ‌ద‌ర్శ‌కాలు లేని వైనం తెలిసిందే. దీంతో.. ఆయా పార్టీలు మొద‌లు నేత‌లు.. సానుభూతిప‌రులు త‌మ‌కు తోచిన‌ట్లుగా ప్ర‌చారం చేసేవారు. ఈసారి అందుకు భిన్నంగా పార్టీలు.. బ‌రిలో నిలిచే అభ్య‌ర్థులు  చేసే ప్ర‌చారంపై మార్గ‌ద‌ర్శ‌కాల్ని విడుద‌ల చేసింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం.

షెడ్యూల్ ను విడుద‌ల చేసిన సంద‌ర్భంగా రాజ‌కీయ పార్టీలు సోష‌ల్ మీడియా ద్వారా చేసే అన్ని ప్ర‌క‌ట‌న‌ల మీదా ముందుగా ఈసీ అనుమ‌తి తీసుకోవాల‌ని పేర్కొంది. అంతేకాదు.. అభ్య‌ర్థులు త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల వివ‌రాల్ని ముందుగానే ఈసీకి స‌మ‌ర్పించాల‌ని పేర్కొంది. మీడియా స‌ర్టిఫికేష‌న్.. ప‌ర్య‌వేక్ష‌క క‌మిటీలో సోష‌ల్ మీడియా నిపుణులు ఉంటార‌ని తెలిపింది.

ఎన్నిక‌ల వేళ సోష‌ల్ మీడియాలో రాజ‌కీయ పార్టీలు త‌మ ప్ర‌త్య‌ర్థుల‌పై క‌త్తులు దూయ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువ అవుతోంది. కొన్ని సంద‌ర్భాల్లో త‌ప్పుడు ప్ర‌చారాలు.. ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టేలా స‌మాచారాన్ని పొందుప‌రుస్తూ గంద‌ర‌గోళానికి గురి చేస్తున్న వైనాలు చూస్తున్న‌వే.

ఇలాంటి వాటికి చెక్ చెప్పేందుకు వీలుగా ఈసీ స‌రికొత్త మార్గ‌ద‌ర్శ‌కాల్ని జారీ చేసింది. ఈసీ నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించే వారిపై ఫిర్యాదు చేయొచ్చు. ఇలాంటి ఫిర్యాదుల్ని ప‌రిశీలించేందుకు ఫేస్ బుక్.. గూగుల్ ప్ర‌త్యేకంగా గ్రీవెన్స్ అధికారిని నియ‌మించిన‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ సునీల్ ఆరోరా ప్ర‌క‌టించారు.

ఎన్నిక‌ల స‌ర‌ళి.. స‌ర్వేలు.. ఫ‌లితాలు అంటూ సోష‌ల్ మీడియాలో ఫేక్ న్యూస్ జోరుగా వ్యాప్తి చెంద‌టం.. అతిగా స్పందించే ధోర‌ణిపై ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తాజా ఎన్నిక‌ల్లో ఆన్ లైన్లో రాజ‌కీయ పార్టీల ప్ర‌క‌ట‌న‌లు.. ప్ర‌చారంపై ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. సో.. గ‌తంలో మాదిరి తోచిన‌ట్లుగా సోష‌ల్ ప్ర‌చారం సాధ్యం కాద‌న్న విష‌యాన్ని ప్ర‌తిఒక్క‌రూ గుర్తుంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.
Tags:    

Similar News